కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో లాక్డౌన్ ప్రకటించింది భూటాన్. డిసెంబర్ 23 నుంచి ప్రారంభమై ఏడు రోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్ తెలిపారు.
పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలన్నీంటికీ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అత్యవసర సేవలు, ఎంపిక చేసిన దుకాణాలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి.
"జిల్లాల మధ్య రాకపోకలపై ఆంక్షలకు కొనసాగింపుగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ కొవిడ్ టాస్క్ఫోర్స్ నిర్ణయించింది. స్థానిక వ్యాప్తి సూచించే విధంగా.. థింపు, పారో, లామోయిజింఖా ప్రాంతాల్లో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం."
-భూటాన్ ప్రకటన
భూటాన్ వైద్య శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు ఆ దేశంలో 479 కేసులు నమోదయ్యాయి. అందులో 430 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఒక్క వ్యక్తి కూడా కరోనా కారణంగా మరణించలేదు.
ఇతర దేశాల్లో ఇలా...
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పెరూలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. లాటిన్ అమెరికాలో పది లక్షల కేసులు నమోదైన ఐదో దేశంగా నిలిచింది. మొత్తంగా దేశంలో 10,00,153 కేసులు నమోదు కాగా.. 37 వేలకు పైగా బాధితులు మరణించారు. అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న జాబితాలో పెరూ ముందు వరుసలో ఉంది.
దక్షిణ కొరియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో 1,092 కేసులను గుర్తించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,550కి, మరణాల సంఖ్య 739కి చేరినట్లు స్పష్టం చేసింది. గడిచిన రెండు వారాల్లోనే 13,310 కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది.
అమెరికాలో కరోనా వ్యాప్తి ప్రమాదకర రీతిలో కొనసాగుతోంది. కొత్తగా 1,99,080 కేసులు బయటపడ్డాయి. మరో 3,376 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య కోటి 86 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 3.30 లక్షలకు పెరిగింది.
బ్రెజిల్లో 55,799 కేసులు బయటపడ్డాయి. 963 మంది మరణించారు. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 73.20 లక్షలకు ఎగబాకింది. మొత్తం మరణాల సంఖ్య 1.88 లక్షలకు చేరింది.
వివిధ దేశాల్లో కొవిడ్ వ్యాప్తి ఇలా..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 1,86,84,628 | 3,30,824 |
బ్రెజిల్ | 73,20,020 | 1,88,285 |
రష్యా | 29,06,503 | 51,912 |
ఫ్రాన్స్ | 24,90,946 | 61,702 |
బ్రిటన్ | 21,10,314 | 68,307 |
టర్కీ | 20,62,960 | 18,602 |
ఇటలీ | 19,77,370 | 69,842 |
స్పెయిన్ | 18,38,654 | 49,520 |