బంగ్లాదేశ్‌లో సమ్మె చేస్తోన్న ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. భారతీయ దిగ్గజ సంగీత వాయిద్యకారుడు అల్లావుద్దీన్ ఖాన్ జన్మస్థలం అయిన బ్రహ్మన్బరియాలోని సెంట్రల్ లైబ్రరీకి హిఫాజత్ ఉగ్రవాదులు ఆదివారం నిప్పంటించారు.
ఆ దేశంలోని ఢాకా, నార్సింగ్డీ, నారాయణ్‌గంజ్, చిట్టాగాంగ్, సిల్హెట్, రాజ్‌షాహీ సహా.. పలు జిల్లాల్లో హిఫాజత్-ఇ-ఇస్లామ్ సమ్మె కొనసాగుతోంది. ఫలితంగా.. రహదారులపై బస్సులు తిరగలేదు. కానీ, ఆటోరిక్షాలు, రిక్షాలు వంటి వాటికి అనుమతించారు.
సమ్మెలో భాగంగా.. నారాయణ్‌గంజ్ మదానీనగర్ మద్రాస విద్యార్థులు.. ఢాకా-చిట్టాగాంగ్ రోడ్డుపై టైర్లను తగులబెట్టారు. ఫలితంగా.. చిట్టాగాంగ్, సిల్హెట్ నుంచి రాజధానికి వెళ్లే మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంచత్తర్ ప్రాంతంలోని రాజ్షాహి ట్రక్ టెర్మినల్‌లో రెండు ప్రభుత్వ బస్సుల(బీఆర్టీసీ)కు నిప్పంటించారు ఉగ్రవాదులు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు.
బంగ్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కరుడుగట్టిన ఇస్లామ్ గ్రూప్‌నకు చెందిన వారు మంగళవారం హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నలుగురు మరణించగా.. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పాత్రికేయులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: బంగ్లా పర్యటన పూర్తి.. భారత్‌కు మోదీ