పాకిస్థాన్‌పై సౌదీ అరేబియా ఇంకా గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల నెలకొన్న పరిస్థితులతో పాక్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు సౌదీ సుముకంగా లేనట్లు తెలుస్తోంది. సౌదీ నాయకత్వాన్ని శాంతింపజేసేందుకు రియాద్ వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా... సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ కాలేకపోవటమే ఇందుకు నిదర్శనం.
కశ్మీర్ అంశంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. బజ్వాతో పాటు పాక్ నిఘా విభాగం (ఐఎస్ఐ) అధినేత జనరల్ ఫయజ్ హమీద్.. సోమవారం సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రిన్స్ ఖలిద్ బిన్ సల్మాన్, సైన్యాధినేత జనరల్ ఫయద్ బిన్ సల్మాన్ అల్ రువాలితో భేటీ అయ్యారు. కానీ.., రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ కాలేకపోయారు.
కశ్మీర్ అంశంలో తమకు మద్దతు పలకాలని సౌదీకి లేఖ పంపింది పాకిస్థాన్. కానీ.. అందుకు సౌదీ నిరాకరించింది. దీంతో ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్)పై పాక్ విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో సౌదీకి హెచ్చరికలు పంపారు. ఖురేషీ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్‌కు ఇచ్చిన 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది సౌదీ.
సౌదీతో సంబంధాలు తెబ్బతినటం వల్ల పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బజ్వా భేటీ విఫలమవటం కూడా అదే విషయాన్ని రుజవుచేస్తోంది. ఇస్లామాబాద్‌కు సౌదీ చాలా సందర్భాల్లో సాయం చేసింది. 1980లో తొలి బ్యాచ్ ఎఫ్-16 యుద్ధ విమానాల కొనుగోలుకు సాయం చేసింది. అలాగే రెండేళ్ల క్రితం 6.2 బిలియన్ డాలర్లు రుణం అందించింది. అందులో 3.2 బిలియన్ డాలర్ల చమురు, మిగతా 3 బిలియన్ డాలర్లు నగదు రూపంలో ఇచ్చింది. మూడేళ్లపాటు రుణాల చెల్లింపు నిలిపివేతకు ఇరు దేశాల మధ్య 2019, మేలో ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది దానిని పునరుద్ధరించాల్సి ఉంది. అయితే.. పాకిస్థాన్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సౌదీ నాయకత్వం.. ఈ సౌకర్యాన్ని నిలిపివేసింది. టర్కీ, మలేషియా, ఇరాన్ వైపు పాకిస్థాన్ మొగ్గు చూపటం, చైనాపై అధికంగా ఆధారపడటం సౌదీల కోపానికి కారణం అయి ఉండవచ్చు.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై పాక్‌కు సౌదీ షాక్- చమురు సరఫరా కట్