అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి ఓటర్లు రికార్డు స్థాయిలో ముందుస్తు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1.7 కోట్ల మంది ఇప్పటికే బ్యాలెట్ ద్వారా తమ ఓటును వేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో ఇది 12 శాతమని అధికారులు తెలిపారు. అమెరికా చరిత్రలో ఇంతమంది ముందుగా ఓటు వేయడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.
15 కోట్ల మంది..
ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. మరో 8 రాష్ట్రాలు ముందస్తుగా నమోదైన ఓట్ల వివరాలు ఇంకా వెల్లడించలేదని.. ఆ రాష్ట్రాలు కూడా వెల్లడిస్తే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అమెరికన్ల ఆసక్తి చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 15 కోట్ల మంది ఓటు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చరిత్రలో తొలిసారి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ నమోదు కాని ఓటింగ్ ఈ సారి నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణుడు మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. బ్యాలెట్ ఓట్లలో డెమొక్రటిక్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో.. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ ప్రచారానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అయితే, అంతిమంగా వెలువడే ఫలితాలకు ఇదే కొలమానంగా తీసుకోలేమని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి.