ద్వీపదేశం ఆస్ట్రేలియాను కార్చిచ్చు భయాందోళనకు గురిచేస్తోంది. న్యూసౌత్‌వేల్స్‌లో ఉగ్రరూపం దాల్చిన దావానలం.. అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మరిన్ని నెలలు కార్చిచ్చు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇది సహాయక చర్యల్లో పాల్గొంటున్న అక్కడి అగ్నిమాపక సిబ్బందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. కొద్ది రోజులుగా మంటలను అదుపుచేసేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తుండటమే ఇందుకు కారణం.
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ సూచించారు. అయితే.. వారికి అదనపు ప్రయోజనాలూ కల్పిస్తామని పేర్కొంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. స్వచ్ఛందంగా విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందికి 20 రోజుల వేతనంతో కూడిన సెలవుల్ని ఇస్తామని ప్రకటించింది..
ఆస్ట్రేలియాలో కొద్ది నెలలుగా విధ్వంసం సృష్టిస్తున్న కార్చిచ్చు ధాటికి.. ఇప్పటికే 12.35 మిలియన్ల ఎకరాలు మంటల్లో బూడిదయ్యాయి. దాదాపు 950 ఇళ్లు దహనమైపోయాయి. మొత్తంగా 9 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి: చిలీలో కార్చిచ్చు... అగ్నికి ఆహుతైన 80 ఇళ్లు