ఆస్ట్రేలియాలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ యుద్ధం ముదురుతోంది. తాజాగా స్వలింగ సంపర్కులపై మొదలైన వివాదమే అందుకు ఉదాహరణ. క్రైస్తవ విశ్వాసాల ప్రకారం అసాధారణ లైంగిక ఆలోచనల కారణంగా స్వలింగ సంపర్కులు నరకానికి వెళ్తారన్న వాదనను రెండు ప్రధాన పార్టీలు ఖండించాయి.
2017 ఎన్నికల్లో భాగంగా వివాహాల్లో సమానత్వంపై చర్చకు తెర లేపారు విపక్ష నేత బిల్ షార్టెన్. ఇదే విషయంలో ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్వలింగ సంపర్కుల వివాహాలను వ్యతిరేకించారు. మే 18న ఎన్నికలు జరగనున్నందున ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వలింగ సంపర్కులు నరకానికి వెళ్తారా? లేదా? అన్న విషయంపై ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు షార్టెన్.
" స్వలింగ సంపర్కులు నరకానికి వెళ్లటం వంటి విషయం ఈ ఎన్నికల్లో చర్చకు వస్తుందని నేను నమ్మలేకపోతున్నా. ఈ విషయంపై ప్రధాని ఎందుకు వెంటనే స్పందించలేకపోయారు. ఈ విషయమై దేశమంతా రాజకీయ చర్చ జరగాలి. ఈ నాలుగు రోజుల్లో ఈ అంశంలో స్పష్టత రావాలి."
-బిల్ షార్టెన్, ప్రతిపక్ష నేత
ఇటువంటి సున్నిత విషయాలను రాజకీయం చేస్తున్నారని షార్టెన్పై మండిపడ్డారు మారిసన్.
"ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవటం విచారకరం. ఇలాంటి విషయాలు ఎన్నికల ప్రచారంలో ఉండటం అవాంఛనీయం. అవి ప్రజల నమ్మకాలు. మీకు తెలుసు.. నేను మతాధికారి పదవికోసం పోటీలో లేను.. ప్రధాని పదవికి చేస్తున్నా. స్వలింగ సంపర్కులు నరకానికి వెళ్తారన్న విషయాన్ని నేనూ నమ్మను. -స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
ఇదీ చూడండి: చంద్రుడు చిన్నగా అయిపోతున్నాడు: నాసా