అఫ్గానిస్థాన్, నాన్ గర్హార్ రాజధాని జలాలాబాద్ లో ఓ జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐఎస్) చేసిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. వందలాదిమంది తీవ్రవాదులు, రక్షక బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. దీంతో జలాలాబాద్ జైలును సీజ్ చేశారు అధికారులు.
స్థానిక గవర్నర్ కార్యాలయం సమీపంలో, నిత్యం భారీ భద్రతా బలగాలు మోహరించి ఉండే ప్రాంతంలో ఉంది ఆ జైలు. అయినా, ఆదివారం ప్రవేశద్వారం వద్ద ఓ కారు బాంబు పేలింది. ఆపై భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఐఎస్ తీవ్రవాదులు. రాత్రంతా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో అనేకమంది ఖైదీలు, సామాన్య పౌరులు, రక్షక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు గవర్నర్ అధికార ప్రతినిధి అత్తవుల్లా ఖోగ్యాని. ఇదే అదనుగా ఘర్షణ సమయంలో సుమారు 1500 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని. అయితే,వారిలో 1000 మందిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు ఖోగ్యాని.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. తామే దాడికి పాల్పడినట్లు ఖొరాసన్లోని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. అయితే, దాడి వెనుక అసలు కారణం ఇంకా తెలుపలేదు. ఓ సీనియర్ ఐఎస్ ఉగ్రవాద కమాండర్.. అఫ్గాన్ ప్రత్యేక బలగాల చేతిలో హతమైన ఓ రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.
ఇదీ చదవండి: 'అనుబంధం, ఆప్యాయతల ప్రతీక.. రాఖీ'