దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్‌లోని పలు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని ఛాందసవాదులు దాడులకు(bangladesh violence durga puja) పాల్పడగా.. వాటికి వ్యతిరేకంగా మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అల్లరి మూకలు హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు(Bangladesh violence). ఈ ఘటనల్లో 66 ఇళ్లను ధ్వంసం చేశారు. సుమారు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 255 కిలోమీటర్ల దూరంలోని రంగాపుర్ జిల్లా పిర్గాంజ్ ఉపాజిలా గ్రామంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు వందమందికిపైగా దుండగులు దాడుల్లో(Bangladesh violence) పాల్గొన్నట్లు పేర్కొంది.
ఓ ఫేస్బుక్ పోస్ట్ కారణంగా అల్లర్లు చెలరేగాయన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలు జరిగిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో బలగాలను తరలించినట్లు ఏఎస్పీ మొహమ్మద్ కమ్రుజామాన్ తెలిపారు.
" ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ అల్లర్లు జరిగాయి. వేగంగా స్పందించిన అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేశాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 66 ఇళ్లు ధ్వంసం కాగా.. 20 కాలిబూడిదయ్యాయి. "
- మొహమ్మద్ కమ్రుజామాన్, ఏఎస్పీ.
భద్రతా బలగాల సాయంతో దుండగులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు 52 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఏఎస్పీ. కొన్ని ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించిన క్రమంలో వారు లేని వాటికి నిప్పు పెట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో నలుగురు మృతి