హైడ్రాక్సీక్లోరోక్విన్... యాంటీమలేరియా డ్రగ్. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 'దేవుడిచ్చిన బహుమతి'గా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పరిగణించారు. అయితే ఈ డ్రగ్ ప్రామాణిక చికిత్స కంటే ప్రభావవంతమైనదేమీ కాదని ఇటీవలి చైనా వైద్య పరిశోధనలు పేర్కొన్నాయి. మార్చి 6న జేజియాంగ్ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. కొవిడ్-19 సోకిన 30 మంది రోగులపై చైనా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
రెండు గ్రూపులుగా పరీక్ష
వీరిలో 27 మంది కరోనా రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. 13 మందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను ఇచ్చారు. మరో 14 మందికి ఇవ్వలేదు. ఇలా వారం రోజులు చేసిన తర్వాత వారందరినీ పరీక్షించగా.. ఈ 14 మందితో పోలిస్తే యాంటీమలేరియా డ్రగ్ తీసుకున్న 13 మందికి కరోనా నెగటివ్‌గా వచ్చింది. అయితే ఇందులో ఓ రోగికి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
కానీ ఈ రెండు గ్రూపుల్లోనూ కరోనా నుంచి కోలుకునేందుకు పట్టే సగటు సమయం మాత్రం ఒకేలా ఉండటం గమనార్హం.
కరోనాపై ఇదే డ్రగ్‌ను యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి తీసుకున్నప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేసిందని ఇటీవలి ఫ్రెంచ్ అధ్యయనంలో తేలింది. అందుకే ప్రస్తుతం హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు దాని అనుబంధ సమ్మేళనమైన క్లోరోక్విన్‌పై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపుతోంది.
'గేమ్ ఛేంజర్'
అమెరికాలో ఈ ఔషధం తగినంతగా అందుబాటులో ఉండేందుకు తన అధికార యంత్రాంగం ఫార్మా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. అయితే... పరీక్షలు చేసి ధ్రువీకరించడానికి ముందే.. ఈ ఔషధంపై అతిప్రచారం(ఓవర్‌హైప్) చేయడం తగదని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం వీటిని 'దేవుడిచ్చిన బహుమతి', 'గేమ్ ఛేంజర్'గా పరిగణిస్తున్నారు. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఈ మెడిసిన్‌ను పరీక్షించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ అమెరికాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1000 మందికిపైగా మరణించారు. 68 వేలకు పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 21వేల మందికిపైగా చనిపోయారు. 4.5లక్షల కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : కరోనాతో మలేరియా మందుకు గిరాకీ.. అమెరికా నుంచి ఆర్డర్లు!