ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో యాంటీ వ్యాక్సిన్ నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్‌లో కోవిడ్ కేసులు పెరగగా.. ప్రతి ఒక కార్మికుడు కనీసం ఒక్క డోసు కోవిడ్ టీకా అయిన వేసుకుని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ రంగ కార్మికులు దీన్ని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురికి గాయాలయ్యాయి. 40 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతున్న మెల్‌బోర్న్‌లో సోమవారం నుంచి జరుగుతున్న ఈ నిరసనలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు నగరంలో నిర్మాణ పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల నిరంతర కదలికలతో కొవిడ్ వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితి తమకు సవాల్‌గా మారిందని విక్టోరియాకు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నిరసనకారులు నినాదాలు చేసుకుంటూ వీధుల్లో ర్యాలీ చేపట్టడం, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడం వంటి దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిరసనకారుల్లో నిర్మాణరంగ కార్మికులతో పాటు టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించేవారు, విక్టోరియాలో లాక్‌డౌన్‌ని పొడిగించడం ఇష్టంలేనివారూ ఉన్నారు.
కొవిడ్‌ను తగ్గించలేవు..
ఈ ఘటనలపై విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్.... డాన్ ఆండ్రూస్ స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు, అంతరాయాలు కొవిడ్‌ను తగ్గించడంలో ఏ మాత్రం సత్ఫలితాలివ్వబోవన్నారు. ఈ అల్లర్లు కొవిడ్‌తో ఐసీయూలో చేరకుండా ఆపలేవని ఒక్క వ్యాక్సినేషన్ మాత్రమే రక్షించగలదని అన్నారు. మరోవైపు మంగళవారం ఒక్కరోజే విక్టోరియాలో 603 కొత్త కరోనా కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. సిడ్నీ, మెల్‌బోర్న్‌లో వ్యాక్సినేషన్ రేటు పెరగడం వల్ల క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. రెండు డోసులూ వేసుకున్నవారి శాతం 70 నుంచి 80శాతానికి చేరితే మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో 53శాతం పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ జరగ్గా.. విక్టోరియాలో 44శాతం మేర జరిగింది.
ఇదీ చదవండి: తాలిబన్లతో నిరంతరం టచ్‌లో పాక్ సైన్యం!