ఇరాన్‌లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్లో 18 మంది మృతి చెందారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి మెడికల్ కిట్లను తెప్పించుకుంది ఈ దేశం. కరోనా ప్రభావంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇరాక్ ప్రజలు.. ఇరాన్ వెళ్లకుండా నిషేధం విధించింది బాగ్దాద్. కువైట్ నుంచి ఇరాన్‌కు విమాన సేవలు కూడా నిలిపివేశారు.
ఇజ్రాయెల్‌లో మొదటి కేసు..
ఇజ్రాయెల్‌లో శుక్రవారం మొదటి కరోనా కేసు నమోదైంది. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో నిర్భందం తర్వాత నుంచి ఇంటికి చేరుకున్న వ్యక్తిగా అతడిని గుర్తించారు. ఈ నౌకలో ప్రయాణించిన 15 మంది ఇజ్రాయెల్ వాసుల్లో 11 మంది నిర్భందం నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మిగతావారిలో వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే అన్ని విమానాలపై ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.
చైనా జైళ్లలో 500మంది బాధితులు
చైనాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. 2,118 మంది మృతి చెందారు. చైనా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి 220 ఉన్న కేసులు శుక్రవారం భారీగా పెరిగాయి. వుహాన్‌లోని మహిళా జైలులోనే అధికంగా వైరస్ బారినపడ్డారు.
ఇదీ చదవండి: 'గ్రే' జాబితాలోనే పాక్.. జూన్ వరకు గడువు