అఫ్గానిస్థాన్‌లో సంభవించిన ప్రాథమిక మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలన్నీ తాలిబన్లతో(Afghan Taliban) సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని అమెరికాకు చైనా సూచించింది. వారికి దిశా నిర్దేశం చేయాలని తెలిపింది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై(Afghan Crisis) అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం టెలిఫోన్లో సంభాషించారు. అమెరికా బలగాల ఉపసంహరణతో అప్గాన్‌లో ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై మళ్లీ బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
'అంతర్జాతీయ సమాజం నుంచి అఫ్గాన్‌కు ఆర్థిక సాయం, జీవనోపాధి, మానవతా సాయం అందేలా అమెరికా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అఫ్గాన్ నూతన రాజకీయ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగేలా చేయూతనందించాలి. సామాజిక భద్రత, స్థిరత్వం, కరెన్సీ తగ్గుదల, ద్రవ్యోల్భణం వంటి సమస్యలు తలెత్తకుండా అఫ్గాన్ పునర్నిర్మాణం సాధ్యమైనంత త్వరగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై పోరాడేందుకు అఫ్గానిస్థాన్‌కు అమెరికా పటిష్ఠమైన చర్యలతో సాయం అందించాలి. తీవ్రవాదంపై ద్వంద్వ వైఖరి అవలంబించకుండా అఫ్గాన్ ప్రాంతీయ సమగ్రత, స్వతంత్రను కాపాడేలా అమెరికా నిర్ణయాలు ఉండాలి.' అని బ్లింకెన్‌కు వాంగ్ సూచించారు.
పంతాలొద్దు.. చర్చలు ముద్దు..
ఈ సందర్భంగా చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను కూడా బ్లింకెన్ ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావాలని అమెరికా ఆశిస్తే.. గుడ్డిగా అబాండాలు మోపడం, దాడులకు దిగడం చేయొద్దని స్పష్టం చేశారు. తమ ప్రాదేశిక సమగ్రత, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలు తక్కువగా అంచనా వేయడం ఆపాలన్నారు. పంతాలకు పోవడం కంటే చర్చలు మేలని, ఘర్షణల కంటే సహకారం ఉత్తమమని హితవు పలికారు. అమెరికా తమతో ప్రవర్తించే విధానాన్ని బట్టే సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు.
జో బైడెన్ అధ్యక్షుడిగా(Joe Biden) బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా-చైనా తొలివిడత సైనిక చర్చలు జరిపాయి. అనంతరం ఇప్పుడే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో సంభాషించారు.
అఫ్గాన్ తాలిబన్ల(Taliban News) ప్రతినిధులతో చైనా ఇటీవలే దౌత్య చర్చలు జరిపింది. చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌తో కలిసి అప్గాన్ విధానంపై సమన్వయంతో ముందుకు సాగుతోంది.
తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్‌తో గత నెలలో జరిపిన చర్చలో.. అఫ్గాన్‌లో ఉగ్రవాద గ్రూప్‌ల నుంచి విడిపోవాలని చైనా అతనికి స్పష్టం చేసింది. అలాగే షిన్జియాంగ్ నుంచి వచ్చే వీగర్లకు అఫ్గాన్‌లో ఆశ్రయం ఇవ్వొద్దని చెప్పింది.
ఇదీ చూడండి: Afghan Taliban: మహిళలకు ఇక నరకమే- ట్రైలర్ చూపించిన తాలిబన్లు