యెమెన్ దేశంలోని ధమర్ నగరంలో ఉన్న జైలుపై సౌదీ నేతృత్వంలోని సైనిక దళం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ కమిటీ తెలిపింది.
యెమెన్‌లోని హుతి తిరుగుబాటు దారులు డ్రోన్లు, ఆయుధాలు నిల్వ చేసే భవనాలే లక్ష్యంగా దాడి చేసినట్లు సౌదీ సైనిక దళం పేర్కొంది. అయితే జైలుపై దాడి జరిగినట్లు తిరుగుబాటుదారులు తెలిపారు.
దాడుల సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందాలతో ఘటనాస్థలానికి చేరుకుంది రెడ్ క్రాస్ సంస్థ. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భవనంలోని శిథిలాల కింద ఉన్న వారికోసం సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాటుదారులపై 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని కూటమి దాడులు చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు వేల సంఖ్యలో తిరిగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:'కశ్మీర్లో ఉగ్రవాదుల ఉనికి తగ్గిపోయింది'