తాలిబన్లు చంపేసినా సరే వెనక్కి తగ్గబోమని, బాలికల విద్య కోసం కృషి చేస్తూనే ఉంటామని అఫ్గానిస్థాన్ ఉపాధ్యాయులు తేల్చి చెబుతున్నారు. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకొని(taliban news) కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని అధ్యాపకులు ఈ మేరకు వ్యాఖ్యానించారు. బాలికా విద్య కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని చెప్పారు. అంతేగానీ తమ పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.
యూకే టెలిగ్రాఫ్ వార్తా సంస్థతో మాట్లాడిన కాందహార్ రాష్ట్రానికి చెందిన ఓ టీచర్.. తాలిబన్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే.. తన విధి నిర్వహణను పక్కనపెట్టేది లేదని స్పష్టం చేశారు. 'నా పని పట్ల నేను గర్వపడుతున్నా. నా జీవితాన్ని బలితీసుకున్నా సరే ఈ పని ఆపను,' అని చెప్పారు. అఫ్గాన్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ తరపున ఈయన పనిచేస్తున్నారు. 13 వెనకబడిన రాష్ట్రాల్లో 100 పాఠశాలలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
పొంతన లేని చేష్టలు!
మహిళల హక్కులను గౌరవిస్తామని దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాలిబన్లు(taliban press conference) స్పష్టం చేశారు. కానీ వారు ఇచ్చిన హామీకి, చేస్తున్న పనులకు పొంతన లేదని తెలుస్తోంది.
హెరాత్ రాష్ట్రంలో ఇప్పటికే కో-ఎడ్యుకేషన్ నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థినులకు మహిళా టీచర్లే బోధించాలన్న షరతు విధించారని వార్తా సంస్థలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
'ఎంతమంది ఉగ్రవాదులను బైడెన్ తీసుకొస్తారో'