ఈ సాహస బాలిక పేరు కమర్‌గుల్. వయసు 15-16 ఏళ్లు ఉంటుంది. ఆమె తండ్రి గ్రామపెద్ద. ప్రభుత్వానికి మద్దతుదారు. ఇది తాలిబన్లకు రుచించలేదు. అతన్ని చంపడానికి ఈ నెల 17న అర్ధరాత్రి ఉగ్రవాదులు వచ్చారు. ఒంటిగంట సమయంలో కమర్‌గుల్ ఇంటి తలుపు తట్టారు. వచ్చింది ఎవరో చూడడానికి కమర్ తల్లి తలుపు తీసింది. ఉగ్రవాదులని అర్థం చేసుకొని లోపలికి రాకుండా అడ్డుకోగా.. వారు ఆమెను కాల్చి చంపి లోపలికి ప్రవేశించారు. అనంతరం తండ్రినీ హతమార్చారు.
శివంగిలా దూకి..
తల్లిదండ్రులను తన కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపడం చూసి తట్టుకోలేకపోయిన కమర్ శివంగిలా దూకింది. ఇంట్లో ఉన్న ఏకే-47 తుపాకీ తీసుకుని ముగ్గురు ముష్కరులను కాల్చిపారేసింది. అంతటితో ఆగకుండా.. తనపై హతమార్చేందుకు యత్నించిన ఉగ్రవాదులతో గంట పాటు భీకరంగా పోరాడింది. ఆమె కాల్పుల ధాటికి పలువురు గాయపడ్డారు.
సోదరుడిని రక్షించుకుంటూనే..
ఆమె పక్కనే 12 ఏళ్ల సోదరుడున్నాడు. తమ్ముడిని కాచుకుంటూనే, అక్కడా ఇక్కడా దాక్కుంటూనే ఆమె అసమాన పోరాటం చేసింది. ఇంతలో గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సాయంగా వచ్చి ముష్కరులపై కాల్పులు ప్రారంభించగా.. అనంతరం వారు పారిపోయారు.
కమర్ సాహసాన్ని అఫ్గాన్ ప్రభుత్వం ప్రశంసించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని.. అక్కాతమ్ముళ్లను తన భవనానికి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: కాల్పుల కలకలం.. 12 మందికి తీవ్ర గాయాలు