అఫ్గాన్ భద్రతా దళాలకు తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ దాడిలో 90 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
కందహార్లోని పంజ్వై, ఝరి, అర్ఘందాబ్, మైవాండ్ జిల్లాలలో ఈ ఉద్రిక్తతలు తలెత్తినట్లు అఫ్గాన్ రక్షణ శాఖ తెలిపింది. తాలిబన్ల దాడులను సైన్యం తిప్పికొట్టిందని వెల్లడించింది. వాహనాలను పేల్చేసే 15 ల్యాండ్మైన్లను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించారని అనుమానిస్తున్న ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
దాడి జరగలేదు..
అయితే అఫ్గాన్ ప్రకటను తాలిబన్ ఖండించింది. సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తనేలేదని పేర్కొంది. ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించింది. 90 మంది మరణించారని ప్రభుత్వం చెప్పిన గణాంకాలు వాస్తవదూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నైతిక స్థైర్యం కోల్పోయిన సైన్యానికి హామీలు ఇచ్చేందుకే తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించింది.
'దాడి చేశాం'
మరోవైపు, డిసెంబర్ 10న కందహార్ రాష్ట్రంలోని ఝరి జిల్లాలో తాలిబన్లపై వాయు మార్గంలో దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఏఎన్డీఎస్ఎఫ్ చెక్‌పాయింట్ వద్ద అఫ్గాన్ సైన్యంపై జరిగిన దాడికి బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అమెరికా దాడిని తాలిబన్ తప్పుబట్టింది. అమెరికా-తాలిబన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. అమెరికా దాడి వల్ల అఫ్గాన్ పౌరులు బలయ్యారని ఆరోపించింది. కాగా.. ఈ ఆరోపణలను అఫ్గాన్ సైనికాధికారులు ఖండించారు.