శీతల ప్రాంతాల్లో సరస్సులు, నదుల్లోని నీరు గడ్డకట్టడం సహజమే. కాస్త ఉష్ణోగ్రతలు పెరగ్గానే మంచు ఫలకాలు కరిగి నీటిపై తేలుతూ ఉంటాయి. చైనాలోని మంగోలియాలో ఇదే జరిగింది. కాకపోతే మంచు ఫలకం మాత్రం సాధారణమైనది కాదు. కొలిచి కత్తిరించినట్లు సరిగ్గా వృత్తాకారంలో ఉంది. ఇన్నర్ మంగోలియాలోని ఉలాన్హట్ నగరంలోని తాయోవర్ నదిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
నిజానికి ప్రకృతి చేసే మాయాజాలం వల్లే ఇలాంటి వృత్తాకార మంచు ఫలకాలు ఏర్పడతాయి. నది ప్రవాహ వేగానికి నీటి లోపల గుండ్రటి సుడులు ఏర్పడతాయి. ఇవి అక్కడి మంచు ఫలకాలను గింగిరాలు తిప్పుతాయి. నీటిలో తిరుగుతూ, ఇతర మంచుతో ఢీకొట్టి.. ఫలకం గుండ్రంగా తయారవుతుంది. అయితే ఇలా జరగడం మాత్రం చాలా అరుదు.
గత కొన్నేళ్లుగా చైనాలోని హైలోన్గ్జియాంగ్, బులున్ బుయిర్ రాష్ట్రాల్లో ఇలాంటి వృత్తాకార ఫలకాలు కనువిందు చేశాయి. అయితే ఉలాన్హాట్ రాష్ట్రంలో ఇది దర్శనమివ్వడం మాత్రం తొలిసారి. దీంతో స్థానికులు ఇక్కడకు చేరుకొని ప్రకృతి తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు.