Karthika Puranam Chapter 26 : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో కార్తిక పురాణ కాలక్షేపంలో భాగంగా శ్రీ మహావిష్ణువు దుర్వాసుని అహంకారాన్ని అణిచి, తన భక్తుడైన అంబరీషుని ఏ విధంగా కాపాడాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదం
వశిష్ఠులవారు అత్రి, అగస్త్య మహామునుల సంవాదమును ఇంకనూ వివరిస్తూ 26వ రోజు కథను ప్రారంభించాడు. అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి, ఇంకనూ ఇట్లు చెప్పసాగాడు.
శ్రీ మహావిష్ణువును శరణు వేడిన దుర్వాసుడు
ముక్కోపియైన దుర్వాసుడు ఎన్నిలోకములు తిరిగినా సుదర్శన చక్రము బారి నుంచి ఆయనను రక్షించేవారు ఎవరూ లేకపోయారు. దీనితో దిక్కులేక చివరకి వైకుంఠమునకేగి శ్రీమహావిష్ణువు శరణుజొచ్చాడు. "వాసుదేవా! జగన్నాథా! శరణా గతరక్షణ బిరుదాంకితా! నన్ను రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై అపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ వక్షస్థలముపై తన్నినను క్షమించితివి. ఆ కాలిగుర్తు ఇప్పటికి నీ వక్ష స్థలముపై కలదు. ప్రశాంత మనస్కుడవై ఆ రోజు భృగు మహర్షిని రక్షించినట్లే నన్ను కూడా రక్షింపుము. నీ చక్రాయుధము నన్ను తరుముతున్నది. దానిని ఉపసంహరింపుము" అని ఎన్నో విధములుగా ప్రార్థన చేశాడు.
దుర్వాసునికి ధర్మ సూక్షం తెలిపిన విష్ణువు
ఆ విధముగా దుర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూసిన శ్రీహరి చిరునవ్వు నవ్వి "ఓ దుర్వాస! నీ మాటలు అక్షరాల నిజం. నీవంటి తపోధనులు నాకెంతో ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నేను ఎప్పుడూ బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. ప్రతి యుగము నందు గోవులను, బ్రాహ్మణులను, సాధు జనములను రక్షించుటకు ఆయా యుగ ధర్మములను అనుసరించి అవతార స్వీకారం చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణముగా అంబరీషుని శపించావు. నా భక్తుడైన అంబరీషుని నీవు అనేక విధములుగా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతిథివై అతని ఇంటికి వెళ్లి, మహర్షివై ఉండి కూడా ద్వాదశి ఘడియలు దాటకుండా అతనిని భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగమునకు భయపడి, నీ రాకకై ఎంతోసేపు ఎదురుచూసి, జలము మాత్రమే స్వీకరించాడు. అంతకంటే గొప్ప అపరాధము అతను ఏమి చేశాడు? ఎంత కఠిన ఉపవాసములు చేయు వారికైనా కూడా జలము తాగినంత మాత్రమున దాహము శాంతించుటయేగాక, పవిత్రత కూడా చేకూరుతుంది కదా! అటువంటి జలము స్వీకరించాడని నా భక్తుని దూషించి, శపించావు. అతడు తన ఉపవాసవ్రతం భంగము అవుతుందని నీరు తాగాడేకాని, నిన్ను అవమానించుటకు కాదు. అప్పటికి నీ కోపమును చల్లార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ నీవు శాంతించనందున నన్ను మనసారా వేడుకున్నాడు.
దుర్వాసుని శాప ఫలాన్ని స్వీకరించిన నారాయణుడు
"ఓ దుర్వాసా! నీవు శపించినప్పుడు నేనే అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీ శాపఫలమును పది అవతారాల్లో అనుభవిస్తానని అతని చేత పలికించాను. అంబరీషునికి దేహ స్పృహ లేకుండెను. నీవు ఇచ్చిన శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తులలో శ్రేష్ఠుడు. నిరపరాధి. అతనికి బదులుగా ఆ శాపమును నేనే అనుభవిస్తాను. అదెలాగంటే -
శ్రీమన్నారాయణుని దశావతారాలు
విష్ణువు దుర్వాసునితో దుర్వాసా! నీవు ఇచ్చిన శాపం ప్రకారం
- మొదటి అవతారం (మత్స్యావతారం) - సోమకుడను రాక్షసుని చంపుటకై నేను మత్స్యావతారాన్ని స్వీకరిస్తాను.
- రెండో అవతారం (కూర్మావతారం) - దేవదానవులు అమృతభాండం కోసం క్షీరసాగరాన్ని మంధర పర్వతంతో మధిస్తారు. అప్పుడు నేను కూర్మం(తాబేలు) అవతారంలో మంధర పర్వతం నీట మునిగిపోకుండా నా వీపున మోస్తాను.
- మూడో అవతారం (వరాహావతారం) - హిరణ్యాక్షుడనే రాక్షసుని వరాహావతారములో సంహరిస్తాను.
- నాలుగో అవతారం (నరహింసావతారం) - నరసింహుని అవతారంలో నేను హిరణ్యకశ్యపుడిని చంపి నా భక్తుడైన ప్రహ్లదుని రక్షించుకుంటాను.
- ఐదో అవతారం (వామనుడు) - బలిచేత స్వర్గము నుంచి తరిమి వేయబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గం అప్పచెప్పేందుకు నేను వామన అవతారంలో బలిచక్రవర్తి నుంచి ముల్లోకాలను దానంగా స్వీకారించి బలిని పాతాళంలోకి అణగదొక్కుతాను.
- ఆరో అవతారం (పరశురాముడు) - క్షత్రియులను చంపి భూభారమును తగ్గించుటకై నేను పరశురామ అవతారమును ఎత్తుతాను.
- ఏడో అవతారం (శ్రీరాముడు) - లోక కంటకుడైన రావణాసురుని చంపడానికి శ్రీరాముని అవతారము ఎత్తుతాను.
- ఎనిమిదో అవతారం (శ్రీకృష్ణావతారం) - క్షత్రియుడును అయినప్పటికీ కూడా యదు వంశమున శ్రీకృషునిగా పెరిగి, కంసుని చంపుతాను. అలాగే పాండవ పక్షపాతిగా ఉండి కౌరవసేనను అంతమొందిస్తాను.
- తొమ్మిదో అవతారం (బుద్ధుడు) - పాషండ మతమునకు చెందిన బుద్ధుడిగా జన్మించి అహింసను బోధిస్తాను.
- పదో అవతారం (కల్కి) - కలియుగాంతమున కల్కి అవతారంలో, అశ్వాన్ని అధిరోహించి బ్రహ్మద్వేషులను అందరిని మట్టుబెట్టుతాను.
ఈ విధముగా నీవు అంబరీషునికి ఇచ్చిన శాపములను నేను అనుభవిస్తాను. ఈ నా దశావతరములు సదా స్మరించేవారికి వారి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను. ఇది ముమ్మాటికీ తథ్యము అని నారాయణుడు దుర్వాసునితో చెప్పెను. ఈ విధంగా అత్రి అగస్త్యుల సంవాదము ద్వారా ఇరవై ఆరవ రోజు కథను మనకు వశిష్ఠులవారు తెలియజేశారు.
ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! షడ్వింశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.