చైనాలోని చెంగ్డూ పరిశోధన కేంద్రంలో ఓ పాండా కవల పిల్లలకు జన్మనిచ్చింది. సిచువాన్ రాష్ట్రం చెంగ్డూ పట్టణంలోని బ్రీడింగ్ సెంటర్లో రెండు మగ పాండాలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. చాలా చిన్న పరిమాణంలో ఉన్న ఈ పాండాలను చూస్తే ముచ్చటేస్తుంది. ప్రస్తుతం వాటి ఆరోగ్యం క్షేమంగానే ఉందని అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఈ బ్రీడింగ్ కేంద్రంలో 11 పాండాలు జన్మించాయి.
పార్కుల్లో 548 పాండాలు
2018 నవంబర్ నాటికి చైనాలోని పార్క్‌లు, జంతు ప్రదర్శన శాలలలో 548 పాండాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2 వేల పాండాలు అడవులలో ఉన్నట్లు తెలిపారు. వన్య పాండాల్లో ఎక్కువ శాతం చైనాలోని సిచువాన్, షాంగ్జీ రాష్ట్రాలలోనే ఉన్నాయి.