చైనా వుహాన్లో సుమారు 75,000 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ఇది అధికారికంగా ధ్రువీకరించిన బాధితుల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువని స్పష్టం చేసింది.
'2020 జనవరి 25 నాటికి చైనా వుహాన్లో 75,815 మందికి కరోనా వైరస్ సోకినట్లు అంచనా వేస్తున్నాము' అని హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన గాబ్రియేల్ తెంగ్ నేతృత్వంలోని బృందం తెలిపింది.
పొంతన లేదు...
చైనా ప్రభుత్వం మాత్రం జనవరి 31 నాటికి కరోనా బారిన పడి 258 మంది మరణించారని, మరో 9,700 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారికంగా ప్రకటించింది.
వైరస్ సంక్రమించిన తరువాత వ్యాధి లక్షణాలు బయటపడడానికి, వైద్య పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ చేయడానికి మధ్య కొంత సమయం పడుతుంది. అందువల్లనే ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, అధ్యయం వెల్లడించిన గణాంకాలకు మధ్య వ్యత్యాసం ఏర్పడిందని తెంగ్ అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీ
కరోనా విజృంభణను అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంతకు ముందే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అయితే అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలపై ఎలాంటి పరిమితులను సిఫారసు చేయడం లేదని స్పష్టం చేసింది.
అంటువ్యాధితో ... జాగ్రత్త
ఈ కరోనా ఒక అంటువ్యాధి. కనుక ఈ వైరస్ సోకిన ఓ వ్యక్తి ద్వారా... మరో ఇద్దరు నుంచి ముగ్గురికి అది వ్యాపించే అవకాశముందని అధ్యయనం వెల్లడించింది. అలాగే ప్రతి 6.4రోజులకు అంటువ్యాధి పరిమాణం రెట్టింపు అయ్యే అవకాశముందని తెలిపింది.
మొత్తంగా చూసుకుంటే ఒక శాతం కంటే తక్కువ కేసులు మాత్రమే ప్రాణాంతకమని అధ్యయనం స్పష్టం చేసింది. దీనిని సరైన సమయంలో అరికట్టలేకపోతే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశముందని హెచ్చరించింది.
ఇప్పటికే పలు చైనా నగరాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు అధ్యయనం స్పష్టం చేసింది. చైనాకు రాకపోకలు చేసే విదేశీయులకు కూడా ఇది వ్యాపించే అవకాశముందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'సరిహద్దులు మూసేస్తేనే కరోనా త్వరిత వ్యాప్తి'