పాకిస్థాన్ నుంచి చైనాకు యువతులు, మహిళల అమ్మకం యథేచ్ఛగా జరుగుతోంది. పేద వారిని లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో వందల మందిని చైనాకు తరలిస్తున్నారు. 2018 నుంచి 2019 ఏప్రిల్ వరకు దాదాపు 629 మంది యువతులు, మహిళలు దళారుల మోసానికి బలైనట్లు ప్రముఖ వార్తా సంస్థ 'ద అసోసియేటెడ్ ప్రెస్', పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాల్లో ఎక్కువగా పాక్‌లోని మైనారిటీ వర్గమైన క్రిస్టియన్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
రూ.కోట్లలో దందా..
చైనా, పాక్ కు చెందిన దళారులు పేదరికంలో ఉన్న కుటుంబాల యువతులు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు దండుకుంటున్నారు. ఒక్కొక్కరికి నాలుగు నుంచి పది మిలియన్ డాలర్లు లెక్కగట్టి.. కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు మాత్రమే చెల్లిస్తారు. మిగతా డబ్బు దళారుల జేబులోకే వెళుతుంది.
అయితే యువతులు, మహిళల అమ్మకంపై పోలీసులు, దర్యాప్తు సంస్థలకు పాక్ సర్కార్ సహకారం మాత్రం కరవైంది. అందుకే ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టలేని పరిస్థితి దాపరించింది. అక్రమ రవాణాదారులనే అనుమానంతో 31మంది చైనీయులను పాక్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఫైసలాబాద్ కోర్టు వారందరినీ నిర్దోషులని తేల్చింది.
పాక్ వెనుకడుగు..
పాక్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోవడం లేదని స్థానిక దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి మిత్ర దేశమైన చైనాతో కోరి వైరం తెచ్చుకోవడం ఎందుకని పాక్ సర్కారు భావిస్తున్నట్లు వెల్లడించాయి. అదే విధంగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును ఆపాలని ఎఫ్ఐఏకు పాక్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు బాధితుల కుటుంబాలకు సహాయపడుతున్న క్రిస్టియన్ కార్యకర్త సలీం ఇక్బాల్ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న కొంతమంది అధికారులు ఎఫ్ఐఏకు బదిలీ అయినట్లు ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతులు, మహిళల అక్రమ విక్రయం కేసు దర్యాప్తు నెమ్మదించింది.
ఖండించిన చైనా..
అయితే పాకిస్థాన్ నుంచి యువతులు, మహిళలు అక్రమంగా చైనాకు వచ్చారన్న వార్తలను డ్రాగన్ దేశ విదేశాంగశాఖ ఖండించింది. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి జాబితా లేదని పేర్కొంది. రెండు దేశాల ప్రజల మధ్య నిబంధనలకు అనుగుణంగా వివాహాలు జరిగితే స్వాగతిస్తామని.. అక్రమంగా జరిగితే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:హఫీజ్ సయీద్‌పై నేరారోపణకు కాస్త ఆలస్యం..!