తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్ అప్పట్లోనే ప్రకటించింది. కానీ, ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి పీఎల్‌ఏ ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా ఆ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ టాస్ తెలిపింది.
భారత్-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికలో, గల్వాన్ ఘటనలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటిలిజెన్స్ నివేదికలను ఉటంకించింది.
ఏకాభిప్రాయానికి వచ్చాయ్..
సరిహద్దుల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన కారణంగా ఇరుదేశాలు దాదాపు 50వేల మంది సైనికులను మోహరించాయని రష్యా మీడియా సంస్థ టాస్ వెల్లడించింది. అయితే, ఈమధ్యే రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారత్, చైనా విదేశాంగమంత్రుల సమావేశంతో పాటు ఇప్పటికే తొమ్మిది దఫాల్లో కోర్ కమాండర్ స్థాయి చర్చల ఫలితంగా ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఇరుదేశాలు మొదలుపెట్టాయి. దీనిపై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పార్లమెంటులో వివరాలు వెల్లడించారు. బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని..అయితే, దీనివల్ల భారత్ ఏమీ నష్టపోలేదని స్పష్టంచేశారు. చైనాకు అంగుళం భూమి కూడా వదిలేది లేదని పార్లమెంట్ వేదికగా స్పష్టంచేసిన ఆయన, సరిహద్దుల్లో భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.