అఫ్గానిస్థాన్ భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో 375 మంది తాలిబన్లు హతమయ్యారు. 24 గంటల వ్యవధిలో జరిపిన వివిధ ఆపరేషన్లలో మరో 193 మంది గాయపడ్డారని అఫ్గాన్ రక్షణ శాఖ తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ దాడులు జరిపినట్లు వెల్లడించింది. భారీ ఎత్తున భూభాగాన్ని సైతం తిరిగి తన అధీనంలోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
హెల్మండ్ రాష్ట్ర రాజధాని లష్కర్ఘాలో భద్రతా దళాలు నిర్వహించిన వాయు దాడుల్లో 20 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డట్లు రక్షణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అయితే, దీన్ని తాలిబన్లు ఖండించారు. పౌరుల లక్ష్యంగా అఫ్గాన్ సైన్యం దాడులు జరిపిందని పేర్కొన్నారు.
అఫ్గాన్‌లోని అనేక నగరాల్లో తాలిబన్లు, భద్రతా దళాలకు మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దేశవ్యాప్తంగా 223 జిల్లాలు వారి అధీనంలో ఉన్నాయి. 68 జిల్లాలు అఫ్గాన్ సర్కారు చేతిలో ఉండగా.. మరో 116 జిల్లాల్లో ఇరువర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది.
ఇదీ చదవండి: అప్పుల ఊబిలో పాక్- అద్దెకు ప్రధాని ఇల్లు!