హాంకాంగ్‌లో ముఖానికి ముసుగు ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చాక తొలి కేసు నమోదైంది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించారని 18 ఏళ్ల విద్యార్థి, 35 ఏళ్ల నిరుద్యోగ మహిళపై పోలీసులు కేసు పెట్టారు. నిషేధాజ్ఞల ఉల్లంఘనతోపాటు చట్టవ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో భాగస్వాములయ్యారని వారిపై అభియోగాలు మోపారు. న్యాయస్థానం ప్రస్తుతానికి నిందితులు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
మాస్క్ ధరించిన కేసులో నిందితులకు ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా వేసే అవకాశముంది. అక్రమంగా నిరసన ప్రదర్శన చేపట్టిన కేసులో ఐదేళ్ల వరకు కారాగార శిక్ష వేయొచ్చు.
నేరస్థులకు చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం హాంకాంగ్‌లో మొదలైన నిరసన... క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఆందోళనకారులు ముసుగులు ధరించి వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన ప్రదర్శనలు చేపడుతున్నారు. కొన్నిసార్లు ఈ నిరసనలు హింసాత్మకంగా మారి... పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో నిందితులను గుర్తించడం కష్టంగా ఉందని చెబుతూ... ముఖానికి ముసుగు ధరించడంపై నిషేధం విధించింది హాంకాంగ్ సర్కార్.
మాస్క్‌లపై నిషేధం తర్వాత ఉద్యమకారులు మరింత ఉద్ధృతంగా నిరసన చేపడుతున్నారు. ఇద్దరిపై కేసు నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి : మాస్కులపై రగడ... హాంకాంగ్ మరోమారు ఉద్రిక్తం