అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ను ‘చైనా వైరస్’గా వర్ణిస్తుంటే, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో దాన్ని ‘వుహాన్ వైరస్’ అని పిలుస్తున్నారు. అమెరికా నాయకులు తమను అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని చైనా మండిపడుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో గబ్బిలం మాంసం తిన్న ఒక వ్యక్తి నుంచి కొవిడ్ 19 వైరస్ అందరికీ పాకింది. అది నిజం కాదని బుకాయించే బదులు అన్ని రకాల జంతువుల మాంస విక్రయశాలలను మూసేసి ఉంటే చాలా బాగుండేది. గబ్బిలాలు, పాములు, పునుగు పిల్లులు, అలుగులు, ముళ్లపందుల వంటి అడవి జంతువులే కాదు- పిల్లులు, కుక్కల వంటి పెంపుడు జంతువుల మాంసాలనూ చైనీయులు ఆబగా ఆరగించడమే కరోనా మహమ్మారికి మూలకారణం. అత్యధిక దేశాల్లో ఆవు, కోడి, మేక, గొర్రె, పంది మాంసాలను భుజించడం ఆనవాయితీ. కానీ, చైనీయుల్లా కనిపించిన ప్రతి జంతువునూ తినేయడం అరుదు. ఇతర దేశాల్లో అలాంటి అలవాటు చాలా కొద్ది ఆటవిక తెగల్లోనే గమనించవచ్చు. చైనాలో అడవి జంతువుల మాంసం అందరికీ లభించదు. దాన్ని సంపన్నులు మాత్రమే కొనగలరు. గబ్బిలం, అలుగుల మాంసం తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందనే నమ్మకంతోనే చైనా ధనికులు ఇలాంటి పనులకు దిగుతున్నారు. వారి విడ్డూరపు అలవాట్ల వల్ల భారత్‌తో పాటు అనేక దేశాల్లో పులులు, ఖడ్గమృగాలు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ సమస్త మానవాళి మనుగడకే ముప్పుతెస్తోంది. అసలు నవంబరు చివరివారం నుంచి డిసెంబరు మొదటివారం లోపే వుహాన్‌లో కరోనా కేసులు బయటపడిన సంగతిని చైనా చాలాకాలంపాటు ఎందుకు దాచినట్లు? కరోనా వైరస్ పలువురికి వ్యాపిస్తున్న సంగతిని తన వాట్సాప్ గ్రూపులో తొలిసారిగా బయటపెట్టిన చైనా వైద్యుడిని తీవ్రంగా మందలించారు. కొన్ని వారాల తరవాత ఆ వైద్యుడు మరణించాక ఆయనకు గొప్పతనాన్ని గుర్తించారు. కరోనా విషయం బయటకు పొక్కకుండా అనేకమంది వైద్యులు, నర్సులు, పాత్రికేయులను కటకటాల పాల్జేశారు. దాచడానికి ఏమీ లేకపోతే చైనా ఇన్ని కపట నాటకాలు ఎందుకు ఆడినట్లు?
ఎందుకు మిన్నకున్నట్లు?
అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ సైతం ఈ దుర్వార్తను ముందుగానే ప్రపంచానికి ఎందుకు వెల్లడించలేదు? కరోనా వైరస్ విరుచుకుపడిన సంగతిని తైవాన్ అధికారికంగా డాక్టర్ టెడ్రోస్‌కు తెలియజేసినా, ఆయన ఎందుకు మిన్నకున్నట్లు? తైవాన్ లేఖను ఆయన తొక్కిపట్టారు. డాక్టర్ టెడ్రోస్ మాతృదేశమైన ఈజిప్ట్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టిందని ఇక్కడ గమనించాలి. బహుశా టెడ్రోస్‌కు డబ్ల్యూహెచ్‌ఓ పదవి లభించడం చైనా చలవేనేమో? చైనాతోపాటు అనేక ఆగ్నేయాసియా దేశాల ప్రజలు కుక్క మాంసమే కాకుండా రకరకాల జంతు మాంసాలను తింటారన్నది బహిరంగ రహస్యమే.
అమెరికా సైన్యమే తీసుకొచ్చిందా?
కొవిడ్ 19 వుహాన్‌లో పుట్టలేదని, ఆ వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనీయులూ ఆరోపిస్తున్నారు. నవంబరు-డిసెంబరు మధ్యకాలంలో వుహాన్‌లో జరిగిన అంతర్జాతీయ సైనిక క్రీడల్లో ఓ అమెరికా సైనిక బృందం పాల్గొన్న తరవాతే ఈ వైరస్ అక్కడ తలెత్తిందని వారంటున్నారు. కరోనా వైరస్‌ను అమెరికన్లే ప్రయోగశాలలో పుట్టించి ఉంటే, దానికి విరుగుడు కూడా వారు కనిపెట్టి ఉండాలి. కానీ, నేడు కరోనా కేసుల్లో చైనాను అమెరికా మించిపోతున్నా దానికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అంటే ఆ దేశం వద్ద ఇప్పటికిప్పుడు విరుగుడు లేదనేగా! చైనా వద్ద దాచడానికి ఏమీ లేకపోతే, కరోనా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకొంటోంది? కశ్మీర్ విషయంలో 370వ రాజ్యాంగ అధికరణను రద్దుచేసినప్పుడు భద్రతా మండలిలో నానా యాగీ చేసిన చైనా, కరోనాపై చర్చ జరగకుండా ‘వీటో’ చేసింది. తనకున్న ఉబ్బసం, క్యాన్సర్ రోగాలు నయంచేసుకోవడానికి పంగోలిన్ (అలుగు) పొలుసులు, బొమికెలను పొడి చేసుకుని తిన్న ఒక చైనీయుడి నుంచి 2003లో సార్స్ వ్యాధి వ్యాపించింది. అలాగే సౌదీ అరేబియాలో చెడిపోయిన ఒంటె మాంసం తిన్న వ్యక్తి నుంచి మెర్స్ వ్యాధి విస్తరించింది. కొవిడ్ వ్యాధి విస్తరణకు కారణమంటూ అమెరికా, భారత్‌లలో కొందరు చైనా మీద నష్టపరిహార దావాలు వేసినా, వాటివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే, నిరంకుశ ప్రభుత్వాల వల్ల జరిగే వినాశం ఏమిటో ప్రపంచానికి తెలిసివస్తోంది.
మరో మాట
కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబం పట్టు రోజురోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో- ఆ పార్టీ నేతల్లో కొంత మార్పు కనిపిస్తోంది. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఎవరైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి ఏమైనా మంచి మాటలు మాట్లాడితే పెద్ద అపచారం జరిగిపోయినట్లు భావించేవారు. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు సోనియా పరివారాన్ని తేలిగ్గా తీసుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రధాని మోదీ 21 రోజుల ‘లాక్‌డౌన్’ ప్రకటించినప్పుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ఆయన్ను దేశానికి ‘కమాండర్’ అని కొనియాడారు. తరవాత సోనియా కుటుంబం అదేపనిగా మోదీని ఆడిపోసుకోవడం మంచిది కాదని గ్రహించినట్లుంది. కరోనా విషయంలో మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను మొదట్లో విమర్శించిన సోనియా గాంధీ- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు ప్రకటించిన ప్యాకేజీని ప్రశంసించారు. రాహుల్ గాంధీ కూడా మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలక కుటుంబంలో వస్తున్న మార్పునకు ఇవి సంకేతాలుగా భావించవచ్చు!
రచయిత - వీరేంద్ర కపూర్
ఇదీ చూడండి: కరోనా మరణాలు 37వేలపైనే.. స్పెయిన్‌లో విజృంభణ