విశ్వాసం, సహనంతో కూడిన నవ శకానికి నాంది పలికేందుకు మహాత్ముని శాంతి సందేశాన్ని ప్రపంచం ఆచరించాలని పిలుపునిచ్చారు ఐక్యరాజ్యసమితి జరనల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్(antonio guterres news). జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి(mahatma gandhi jayanti) సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాలు ఆయుధాలు వీడి కరోనా లాంటి ఉమ్మడి శత్రువులను జయించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత సవాళ్లకు పరిష్కారం మనం చేతుల్లోనే ఉందన్నారు. మహాత్ముడిలా మనం కూడా సమాజాన్ని విడదీసే అంశాలపై కాకుండా ఏకం చేసే విషయాలపై దృష్టిసారించాలని పేర్కొన్నారు.
"అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజే గాంధీ జయంతి కూడా కావడం యాదృచ్ఛికం. గాంధీకి అహింస, శాంతియుత నిరసన, గౌరవం, సమానత్వం అనేవి అన్నింటికంటే ఎక్కువ. అవి మానవత్వానికి దారి చూపే దీపాలు. విధ్వేషం, విభజన, వివాదాలకు స్వస్థి పలికి శాంతియుత శకానికి నాంది పలకాలి"
-ఆంటోనియో గుటెరస్
ప్రపంచంలోని అసమానతలు, పేదరికాన్ని నిర్మూలించేందుకు మనం ఇంకా ఎక్కువ కృషి చేయాలని గుటెరస్ అన్నారు. అందుకు సాహసోపేతమైన అంతర్జాతీయ ప్రణాళిక అవసరమన్నారు. ఒకరిపై మరొకరికి విశ్వాసం ఉండాలని చెప్పారు.
ఇదీ చదవండి: 'కరోనా అంతానికి భారత్ పాత్రే కీలకం'