కంటికి కనపడని సైన్యంతో ప్రపంచం యుద్ధం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ సైన్యం కరోనా వైరస్ అని.. దానిపై జరుగుతున్న పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.
"ప్రపంచం ఒక రహస్య శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తోంది. మనం తప్పకుండా గెలుస్తాం!"- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కరోనా ధాటికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 7000మందికిపైగా, అమెరికాలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలా మానవజాతిని కబలిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఉద్దీపన ప్యాకేజీ
కరోనా వైరస్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి 1 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ప్యాకేజీ ద్వారా అర్హులైన అమెరికన్లకు ప్రత్యక్ష నగదు బదిలీ, చిన్న- మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం అందిస్తారు. అంతేకాకుండా కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఎయిర్‌లైన్స్, క్రూయిజ్, రెస్టారెంట్లు వంటి పరిశ్రమలకు నిధులు చేకూరుస్తారు. ఈ ప్యాకేజీలో జీతంతో బతికే మధ్యతరగతి వ్యక్తులకు, చిన్న వ్యాపారులకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
ప్రపంచ బ్యాంకు ఇలా...
వేగంగా వ్యాపిస్తున్న కరోనాను సమర్థవంతంగా అడ్డుకునేందుకు అవసరమైన రెస్పాన్స్ ఫండ్‌ను 14 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కరోనా నియంత్రణకు కృషి చేసే దేశాలకు, సంస్థలకు ఈ నిధులను అందించనుంది. దీని ప్రకారం ప్రారంభ ప్యాకేజీకి 2 బిలియన్ డాలర్లు జోడించింది.
ఈ మహమ్మారి వైరస్ 165కు పైగా దేశాలకు వ్యాపించింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలు అలముకున్నాయి. ఈ కారణంగానే ప్రపంచ బ్యాంకు ఈ రెస్పాన్స్ ఫండ్‌ను పెంచుతూ ప్రకటన చేసింది.
ఈ ప్యాకేజీని ప్రజారోగ్య సంసిద్ధత కోసం జాతీయ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. వ్యాధి నిరోధకత, రోగ నిర్ధరణ, చికిత్సలు చేపడతారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రైవేటు రంగానికి కూడా ఆర్థిక సహాయం అందిస్తారు.
ఇదీ చూడండి: ఖనిజాల కోసం ప్రపంచ దేశాల సాగరమథనం