ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడిని పలు దేశాలు ఖండించాయి. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఇరుపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించాయి.
బదులిస్తాం: ఇజ్రాయెల్
సులేమానీని చంపడంలో అమెరికా చర్యను సమర్థించిన ఇజ్రాయెల్ తాజా పరిణామాల నేపథ్యంలో తమపై దాడికి పాల్పడితే ఊహించని రీతిలో బదులిస్తామని ఇరాన్‌ను హెచ్చరించింది. పశ్చిమాసియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది సులేమానియే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. తమపై దాడికి దిగితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇజ్రాయెల్, అమెరికా మంచి మిత్రదేశాలని వెల్లడించారు.
బ్రిటన్ హెచ్చరిక
దాడి జరిగిన సైనిక స్థావరాలు సంకీర్ణ దళాలకు స్థానమని బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి డోమనిక్ రాబ్ తెలిపారు. అందులో బ్రిటన్ దళాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరోసారి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన చర్యలు చేపట్టవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. యుద్ధం సంభవిస్తే కేవలం ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలకే ప్రయోజనకరంగా ఉంటుందని హితవు పలికారు.
సంయమనం పాటించండి: చైనా
ఇరుపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని చైనా హితవు పలికింది. ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని పేర్కొంది.
ఐరోపా
ఇరాన్ క్షిపణుల దాడిని ఖండించిన జర్మనీ ఉద్రిక్త పరిస్థితులకు త్వరగా ముగింపు పలకాలని ఆకాంక్షించింది. దాడిని ఖండించిన ఐరోపా సమాఖ్య... ఉద్రిక్తతలకు త్వరగా ముగింపు పలకాలని కోరింది.