అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రచారంలో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పిస్తానని హామీ ఇచ్చారు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించటం, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం, వైరస్‌ను అంతమొందించటమే కాకుండా వలసకార్మికులు కూడా తమ ప్రాధాన్యతలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు.
నిధుల సేకరణకు వర్చువల్‌గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు బైడెన్. అధికారం చేపడితే తొలి 30 రోజుల్లో దేశీయ, విదేశాంగ విధానాల పరంగా ఏ విధంగా చర్యలు చేపడతారని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు. సరిహద్దులో కొనసాగుతున్న పరిస్థితులను పరిష్కరించాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ సంక్షోభాన్ని మేమూ ఎదుర్కోవలసి ఉంటుంది. 11 మిలియన్ల మందికి పౌరసత్వం కల్పించే ఇమ్మిగ్రేషన్ బిల్లును హౌస్, సెనేట్‌కు పంపబోతున్నాం. దేశీయ, విదేశీ విధానాలలో వచ్చే ఏడాది జనవరి 21 వరకు చాలా తప్పులు జరగొచ్చు. కానీ, మరో నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉండవు. అధ్యక్షుడిగా నన్ను అమెరికా ప్రజలు ఎన్నుకుంటే.. ఆయన (ట్రంప్) వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృషి చేస్తాం."
- జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి.
అధికారంలోకి రాగానే కరోనా కట్టడికి తమ వ్యూహాన్ని అమలు చేసి.. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తామని భరోసా కల్పించారు బైడెన్. అమెరికాలోని జడ్-జనరేషన్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోందని, వారికి అద్భుతమైన భవిష్యత్తును కల్పిస్తామన్నారు. కరోనా వైరస్ వల్ల దేశంలో 2.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వైరస్‌ను కట్టడి చేయటంలో అధ్యక్షుడు విఫలమయ్యారని ఆరోపించారు.
ఇదీ చూడండి: డొనాల్డ్‌కు షాక్- బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై!