భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇరు దేశాల ప్రధానులతో భేటీ అవుతానని చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఈ నెల 22న జరిగే 'హౌదీ మోదీ' సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదిక పంచుకోనున్నారు ట్రంప్. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ఎప్పుడు సమావేశం అవుతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ట్రంప్ షెడ్యూల్ ప్రకారం..ఈ నెల 22న 50వేల మంది ప్రవాస భారతీయులతో భారీగా జరిగే 'హౌదీ మోదీ' కార్యక్రమంలో మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత న్యూయార్క్ చేరుకుంటారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సాధారణ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే పాక్ ప్రధానితో ట్రంప్ సమావేశమయ్యే అవకాశముంది.
'మోదీకే ట్రంప్ ప్రాధాన్యం'
'హౌదీ మోదీ కార్యక్రమానికి ట్రంప్ హాజరు'.. మోదీతో ఆయనకున్న స్నేహ బంధానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్. మోదీకే ఆయన అధిక ప్రాధాన్యమిస్తారని స్పష్టమవుతోందన్నారు.
కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని గతంలోనే ప్రకటించారు ట్రంప్. ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ప్రపంచ దేశాలకు భారత్ తేల్చి చెప్పింది. ఇప్పుడు మోదీ, ఇమ్రాన్‌లతో ట్రంప్ భేటీ అవుతానని ప్రకటించడం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: 'ఇది సరైన సమయం కాదు.. భవిష్యత్తులో వెళ్తా'