లక్షణాలు లేని వారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు అవసరం లేదన్న అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం(సీడీసీ) మార్గదర్శకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) విభేదించింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది.
కొవిడ్ కట్టడిలో భాగంగా అధికారులు చేపడుతున్న చర్యల్లో పరీక్షల్ని మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరముందని ఆ సంస్థకు చెందిన ప్రముఖ అధికారి మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదొక్కటేనని పునరుద్ఘాటించారు. ఎవరికి పరీక్షలు నిర్వహించాలన్న విషయంలో ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల్ని పాటించొచ్చని సూచించారు. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తికి ఆరడుగుల దూరంలో 15 నిమిషాల పాటు గడిపిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని సంస్థ సూచించిన విషయం తెలిసిందే.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్ దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వాతావరణం చల్లబడుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు పెద్దలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉందని.. ఇది వైరస్ వ్యాప్తికి కారణం కావొచ్చని హెచ్చరించారు. అయితే, వారిని దూరం పెట్టాల్సిన అవసరం లేదని.. ఆరు నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. యూరప్‌లో కొవిడ్ పరిస్థితిని సమీక్షిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను అమెరికా తాజాగా మరోసారి సవరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం అవసరం లేదని సీడీసీ పేర్కొంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో వైరస్ కట్టడిలో విఫలమైన ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలతో టెస్టుల సంఖ్యను మరింత తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలొచ్చాయి. కొవిడ్ కట్టడి కోసం ఏర్పాటైన శ్వేతసౌధపు కార్యదళంలో కీలక సభ్యుడైన డాక్టర్ ఆంథోని ఫౌచీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సీడీసీ తాజా మార్గదర్శకాలు ప్రజల్లో తప్పుడు భావవను కలిగిస్తాయన్నారు. లక్షణాలు కనిపించని వారితో ప్రమాదం లేదనే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.
ఇవీ చదవండి: 'ఉద్రిక్తతలు పెంచేందుకే చైనా క్షిపణి ప్రయోగాలు'