అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోన్న ఉత్తర కొరియాపై అమెరికా తీవ్రంగా స్పందించింది. చర్చల్లో పురోగతి లేకుంటే క్రిస్మస్ సందర్భంగా అమెరికాకు 'బహుమతి' ఇస్తామని ఉత్తర కొరియా బెదిరించిన నేపథ్యంలో శ్వేతసౌధం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత దౌత్యం మాత్రమే కాకుండా తమ వద్ద మరిన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ హెచ్చరించారు.
"ఏం జరుగుతుందో ఊహించాలనుకోవట్లేదు. కానీ, మా టూల్ కిట్‌లో చాలా సాధనాలు ఉన్నాయి. ఉత్తర కొరియాపై అదనపు ఒత్తిడి తీసుకురావచ్చు. అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన సమయానికి ఉత్తర కొరియా నిర్వహించే అణు పరీక్షలే ప్రపంచంలో అత్యంత కఠినమైన సవాలుగా ఉండేవి. ఈ పర్యవసానాలను దగ్గరుండి పరిశీలిస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం."-రాబర్ట్ ఒబ్రెయిన్, అమెరికా జాతీయ భద్రత సలహాదారు
అణ్వస్త్ర నిరాయుధీకరణపై ఈ ఏడాది మొదట్లో ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య హనోయి దీవులలో రెండో సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో పురోగతి లభించలేదు. చర్చలకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల అమెరికాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది ఉత్తర కొరియా. క్రిస్మస్ సందర్భంగా.. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామని ఇది వరకే హెచ్చరించింది.
ఇదీ చదవండి: కిమ్ క్రిస్మస్ 'కానుక'పై ట్రంప్ చమత్కారం