జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలను రాష్ట్రాల గవర్నర్లు అణిచివేయలేకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని హెచ్చరించిన ఒక్క రోజులోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పౌరులపైకి సైన్యం మోహరింపుపై వెనక్కి తగ్గారు.
వాషింగ్టన్ సహా ఇతర ప్రాంతాల్లో మంగళవారం జరిగిన నిరసనల్లో ఎక్కువ హింసాత్మక ఘటనలు జరగకపోవడం సహా రాష్ట్రాలే పరిస్థితిని అదుపు చేస్తాయని భావించినందునే ట్రంప్ ఆలోచన మార్చుకున్నట్లు శ్వేతసౌధం అధికారి ఒకరు తెలిపారు.
"వాషింగ్టన్ డీసీలో సోమవారం రాత్రి ఎలాంటి సమస్యలు లేవు. చాలా మంది నిరసనకారుల్ని అరెస్టు చేశాం. అందరూ చక్కగా విధులు నిర్వర్తించారు. సైన్యం పనితీరు భేష్. అధ్యక్షునికి ధన్యవాదాలు " అని మంగళవారం ట్వీట్ చేశారు ట్రంప్.
గత కొద్ది రోజులుగా వాషింగ్టన్లో నిరసనకారులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. హింసకు పాల్పడ్డారు. వీరిని కట్టడి చేసేందుకు 715 మంది సైనికులను రంగంలోకి దించారు ట్రంప్. ప్రస్తుతం పరిస్థితి శాంతించినందున వారందరినీ మేరీల్యాండ్ జాయింట్ బేస్, వర్జీనియా పోర్ట్కు తరలించారు.
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మెడపై ఓ పోలిస్ అదికారి మోకాలు తొక్కిపెట్టి ఊపిరాడకుండా చేయగా... అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాటి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికా మొత్తం వ్యాపించాయి.