అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల భేటీపై శ్వేతసౌధం తక్కువ అంచనాలతోనే ఉందని తెలుస్తోంది. ఈ సమావేశం ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై అవగాహన వచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన కూడా ఉండకపోవచ్చని చెప్పారు. చర్చల అనంతరం భారీ ప్రకటనలు సైతం ఉండవని స్పష్టం చేశారు.
చైనాతో భేటీకి ముందు ఉద్దేశపూర్వకంగానే క్వాడ్ దేశాలతో అమెరికా సమావేశమైందని అధికారులు తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతోనూ వరుస చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. చైనాతో అనేక సమస్యలపై చర్చలు జరిపే స్థితికి శ్వేతసౌధం ఇంకా చేరుకోలేదని అన్నారు.
తొలిసారి భేటీ!
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా కమ్యునిస్టు పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ యాంగ్ జెయిచీలతో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు. షింజియాంగ్, హాంకాంగ్, టిబెట్లలో మానవహక్కుల ఉల్లంఘన సహా వాణిజ్య అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఓ అవకాశంగా భావిస్తోంది అమెరికా.
బ్లింకెన్‌తో పాటు అమెరికా రక్షణ మంత్రి లాయ్డ్ ఆస్టిన్ మంగళవారం జపాన్‌లో పర్యటించారు. చైనాలోని మైనారిటీలపై ఆ దేశ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. చైనా ఇలాగే వ్యవహరిస్తే.. ప్రతిచర్యలు తీసుకుంటామని బ్రింకెన్ హెచ్చరించారు. వీరిరువురు బుధవారం.. దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
ఇదీ చదవండి: 'బెదిరించారు.. కానీ ఎన్నికల్లో హ్యాకింగ్ చేయలేదు'