కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో రకరకాల శానిటైజర్లు వస్తున్నాయి. అయితే ఎటువంటి వాటిని ఉపయోగించాలి? అనేది చాలా మంది అనుమానం. వీటిని నివృతి చేసేలా కీలక సూచనలు చేసింది అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం. ఆల్కహాల్ మోతాదు ఎక్కువ ఉన్న శానిటైజర్లను వాడాలని సిఫార్సు చేసింది. వాటిలో ఆల్కహాల్‌తోపాటు శుద్ధిచేసిన డిస్టిల్డ్ వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఉండొచ్చని తెలిపింది.
మరి కొన్ని సూచనలు...
- చేతులను శుభ్రం చేసే శానిటైజర్లలో కనీసం 60 శాతం ఇథైల్ ఆల్కహాల్ లేదా 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న వాటిని ఎంచుకోవాలి.
- మిథనాల్, 1-ప్రొపనాల్తో రెండు విషపూరితమైనవి కాబట్టి అవివి ఉన్న వాటికి దూరంగా ఉండాలి.
- బెంజల్కోనియమ్ క్లోరైడ్‌తో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించకూడదు. బ్యాక్టీరియా, వైరస్‌లను ఇవి నాశనం చేయలేవు.
- ఆహారం, పానీయాల డబ్బాలలో శానిటైజర్లను నిల్వ చేయకూడదు. పొరపాటున తాగితే ప్రమాదం.
- సొంతంగా శానిటైజర్లను తయారు చేయడం శ్రేయస్కరం కాదు. రసాయనాలను ఉపయోగించేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే శరీరం కాలే ప్రమాదం ఉంటుంది.
శానిటైజర్లే మేలు...
సబ్బు, నీళ్లతో చేతులను శుభ్రం చేయటం కంటే హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించటం చాలా మంచిదని కొలంబియా విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల శాస్త్రవేత్త బారున్ మాథెమా తెలిపారు. సూక్ష్మజీవులను నాశనం చేయటంలో హ్యాండ్ శానిటైజర్లు బాగా ఉపయోగపడతాయని అన్నారు.