ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రజల దృక్పథంలో మార్పు వస్తోంది. బరువు సమతూకంలో ఉండాలని యువతే కాదు.. కాస్త వయస్సు పైబడిన వారు జిమ్ సెంటర్లు, మైదానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే బరువు పెరిగినట్లు తెలియగానే మన మనసులో మెదిలే మొదటి ప్రత్యామ్నాయం నడక. కానీ నెలల పాటు వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదని తెగ బాధపడుతుంటారు చాలామంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గడంలో నడక ఏ మేరకు సహాయపడుతుందనే దానిపై బ్రిగం యంగ్ విశ్వవిద్యాలయం(బీవైయూ) ఓ సర్వే నిర్వహించింది. నిత్యం నడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చింది.
120 మంది విద్యార్థులపై సర్వే
120 మంది విద్యార్థులపై సర్వే చేసింది బ్రిగం వర్సిటీ. ఈ విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి రోజూ 10 నుంచి 15 వేల అడుగులు (సాధారణం కంటే ఎక్కువ) నడవాలని.. ఆరు నెలలపాటు దీనిని కొనసాగించాలని సూచించింది. ఆరునెలలు ముగిసిన అనంతరం విద్యార్థుల బరువులను నమోదు చేసింది. ఈ వ్యాయామం ద్వారా ఒకటిన్నర కిలోలు కూడా తగ్గలేదని తేల్చింది అధ్యయన బృందం. అయితే అనంతర కాలంలో అడుగుల సంఖ్య పెంచినా ఎటువంటి లాభం లేకపోయింది.
"బరువు తగ్గడానికి వ్యాయామం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు. నడక ద్వారా శారీరక శ్రమ పెరుగుతుంది. అయితే మా అధ్యయనం ప్రకారం రోజూ నడవడం ద్వారా బరువు నియంత్రణపై ఎలాంటి ప్రభావం చూపలేదు. నడక ద్వారా బరువు పెరగడాన్ని నివారించడం కష్టమైన పని అయినప్పటికీ దీని వల్ల శారీరకంగా కొన్ని లాభాలు ఉంటాయి. సాధారణం కంటే అధికంగా నడవడం మంచిది."
- బ్రూస్ బెయిలీ, ప్రొఫెసర్, బ్రిగం విశ్వవిద్యాలయం
ఫలితం లేదని నడకను ఆపేద్దామనుకుంటున్నారా..? కాస్త ఇది కూడా గమనించుకోండి. హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన ఓ ప్రొఫెసర్ చేసిన అధ్యయనంలో నడక ద్వారా మరణాల రేటు తగ్గుతుందని తేలింది మరి.
ఇదీ చదవండి: 'కరోనా' ఆస్పత్రి కూలి నలుగురు మృతి