ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఎక్కువ శాతం ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రముఖ ప్రదేశాల్లో జరిగే నూతన సంవత్సర సంబరాలను డిజిటల్ మాధ్యమాల ద్వారానే తిలకించారు.
స్పెయిన్‌లో బాణాసంచా పేల్చి అట్టహాసంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కానీ కరోనా ఆంక్షలు, భయాల మధ్య ప్రజలు ఎక్కువగా వేడుకలకు హాజరుకాలేదు.
జర్మనీ రాజధాని బెర్లిన్ నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరంలోని ప్రధాన కేంద్రాల్లో బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రజలు లేక కార్యక్రమం బోసిపోయింది.
లాక్డౌన్ మధ్య ఇటలీలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. రోమ్ సహా పలు నగరాలు సుందరంగా ముస్తాబయ్యాయి. అయితే ప్రజలు మాత్రం బయటకు రాలేదు.
ఈజిప్ట్‌లో కొత్త సంవత్సర బాణాసంచా వెలుగులతో ఆకాశం రంగులతో విరజిమ్మింది. కైరోలోని ప్రఖ్యాత లాంగ్ లివ్ వంతెనపై వేడుకలు జరిగాయి.
రష్యాలోనూ కొత్త సంవత్సర వేడుకలు పరిమితంగానే జరిగాయి. పాకిస్థాన్ ప్రజలు ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. టపాసులు పేలుస్తూ, సంగీతానికి చిందులు వేస్తూ 2021ని ఆహ్వానించారు. వచ్చే ఏడాది ప్రజలందరికీ మంచి కలగాలని ఆకాంక్షించారు.
ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకలు జరిగాయి. భవానాన్ని చూడముచ్చటగా తయారు చేసి.. బాణాసంచాలను వెలిగించారు.
జింబాబ్వేలో కొత్త సంవత్సరం సందర్భంగా సంగీత విభావరి నిర్వహించారు. వేలాది మంది ఇందుకు హాజరయ్యారు.