పరాగ్వే పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువునని అన్నారు. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ఉగ్రవాద నిర్మూలనకు ఎలాంటి మద్దతు అవసరం లేదని, తమ దేశానికి ఆ సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు.
" ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువు. దానికి మతం లేదు. అది పిచ్చి, ఉన్మాద చర్య. భూమిపై నుంచి దానిని సమూలంగా తొలగించాలి. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాడినప్పుడే అది సాధ్యం. భారత్‌లోని ఉగ్రవాదంపై పోరుకు ఎలాంటి మద్దతు అవసరం లేదు. భారత్‌కు ఆ సామర్థ్యం ఉంది. ఇటీవలే అది నిరూపితమైంది. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నాం. పాక్ సైన్యంపై భారత వైమానికదళం దాడి చేయలేదు. ఒక్క పౌరునికి హానీ చేయలేదు. కచ్చితమైన లక్ష్యంపైనే దాడి చేశారు." -వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతి
వివాదంపై విచారం
ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి... పుల్వామా ఉగ్రదాడికి దీటైన జవాబు చెప్పామన్నారు వెంకయ్య. వాయుసేన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై కొందరు వివాదం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే పాకిస్థాన్‌కి వెళ్లి ఆ ప్రభుత్వాన్ని విచారించుకోవాలని భారత హోంమంత్రి తెలిపారని గుర్తుచేశారు.
పాక్‌పై పరోక్షంగా..
పొరుగుదేశాలతో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందన్నారు వెంకయ్య. పొరుగుదేశాల్లోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పాకిస్థాన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉగ్రవాద శిక్షణకు ఆ దేశం ఆర్థికంగా సహకరిస్తోందని, ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.