భారత్‌తో దృఢమైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. భారత్ గొప్ప మిత్రదేశమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య వివిధ అంశాల్లో ఆరోగ్యకర చర్చలకోసం ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది.
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ ఆర్టాగస్ మీడియాతో మాట్లాడుతూ భారత సార్వత్రిక ఎన్నికల తీరును ప్రశంసించారు.
"ఎప్పటిలాగే ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తాం. భారత్‌లో ఎన్నికలు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగాయని విశ్వసిస్తున్నాం. పలు విషయాల్లో భారత్‌తో విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విస్తృత చర్చలు జరుపుతారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామ్య దేశం."
-మోర్గాన్ ఆర్టాగన్, అమెరికా విదేశాంగ ప్రతినిధి
అమెరికా చట్ట సభ్యులు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. భాజపా విజయంతో అగ్రరాజ్యంలో సంబరాలు చేసుకున్నారు ఇండో అమెరికన్లు. యూఎస్‌లోని భారత దౌత్య కార్యాలయం సమాచారం మేరకు మోదీకి సుమారు 50 మంది కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, సీనియర్ ప్రభుత్వాధికారులు శుభాకాంక్షలతో సందేశాలు పంపారు.
"భారత్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉంది. అమెరికాకు బలమైన భాగస్వామి. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. మన మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు కృషి చేస్తున్నాం."
-నిక్కీ హేలీ, ఇండో అమెరికన్ రాజకీయవేత్త
"ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానంలో స్పష్టతతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మార్చారు. అన్ని ఖండాల్లో పర్యటించి అన్ని దేశాలతో స్నేహంగా మెలుగుతున్నారు. భారత్ ఇక మూడో తరగతి దేశంగా ఉండదు. ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చోటు సంపాదించింది."
-సంపత్ శివంగి, ఇండియన్ అమెరికన్ ఫోరం అధ్యక్షుడు
ఇదీ చూడండి: మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు:మోదీ