చైనాతో సంబంధాలపై శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్ కేంద్ర స్థానంలోనే కరోనాను నియంత్రించాలని చెప్పారు. వుహాన్‌లోని బయో ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేసేందుకు చైనాపై ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలోనే చైనాకు వ్యతిరేకంగా మరికొద్ది గంటల్లో అమెరికా తన విధానాలను ప్రకటించనుంది.
"శుక్రవారం చైనా అంశమై కీలక ప్రకటనలు విడుదల చేయనున్నాం. ఇది చాలా బాధాకరమైన సందర్భం. దీనిని కేంద్ర స్థానంలోనే చైనా కట్టడి చేయాలి. కానీ చైనా ఆ విధంగా చేయలేదు."
-ట్రంప్ ప్రకటన
చైనా విద్యార్థులపై కరోనా ప్రభావం..
ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం అమెరికాలోని చైనా విద్యార్థులపై ప్రభావం చూపనుంది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న చైనా విద్యార్థులను వెనక్కి పంపించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో వెలువడనున్న ప్రకటనలో ఈ విషయమై ప్రకటిస్తారని అంచనాలు నెలకొన్నాయి.
జీ-7 కృత్రిమ మేధస్సు బృందంలో అమెరికా..
చైనా వినియోగిస్తున్న దారితప్పించే సాంకేతికతకు చెక్ పెట్టే ఉద్దేశంతో జీ-7 దేశాల కృత్రిమ మేధస్సు బృందంలో చేరనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఈ బృందంలో చేరకూడదని ఇంతకుముందు నిర్ణయం తీసుకున్న అమెరికా.. పౌరస్వేచ్ఛను హరించే విధమైన సాంకేతికతను చైనా ఉపయోగిస్తున్న నేపథ్యంలో బృందంలో చేరేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు కూడా చైనాతో పూర్తిస్థాయి సంబంధాలు తెంచుకుంటామని వ్యాఖ్యానించారు ట్రంప్. సరైన సమయంలో కరోనాపై సమాచారం అందించలేదని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని అనుసరిస్తూ చైనాను నిందిస్తూ పలు దేశాలు వ్యాఖ్యలు చేశాయి. మూడు లక్షలకు పైగా ప్రాణాలు బలిగొన్న కరోనాపై సరైన సమయంలో సమాచారం అందించలేదని చెప్పాయి.
ఇదీ చూడండి: ట్రంప్ వర్సెస్ ట్విట్టర్ : కీలక ఉత్తర్వులకు అధ్యక్షుడు ఓకే