అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్కరోజే ఆ దేశంలో రికార్డు స్థాయిలో 1,480 మంది మరణించినట్లు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ట్రాకర్ వెల్లడించింది. గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి అదే సమయానికి 1,480 మంది మరణించారని గుర్తించింది. దీన్నిబట్టి అమెరికాలో వైరస్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి విజృంభణతో ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు అగ్రరాజ్యంలో మృతి చెందినవారి సంఖ్య 7,406కి చేరింది. బాధితుల సంఖ్య 2,77,828గా నమోదైంది. కేవలం న్యూయార్క్‌లోనే లక్షకుపైగా కేసులు నమోదుకాగా, 3000మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు పెరిగింది.
సైన్యానికి కీలక పాత్ర
కరోనాపై పోరులో అమెరికా సైన్యం ముఖ్యభూమిక పోషించేలా మార్గదర్శకాలు జారీ చేశారు ట్రంప్. కంటికి కనిపించని శక్తితో యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
11లక్షలకు చేరువలో
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 10,98,762మంది ఈ వ్యాధి బారినపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 59,172కు పెరిగింది.
అత్యధిక కేసులు నమోదైన దేశాలు
దేశం | కేసులు | మరణాలు |
---|---|---|
అమెరికా | 2,77,828 | 7, 402 |
ఇటలీ | 1,19,827 | 14,681 |
స్పెయిన్ | 1,19,199 | 11,198 |
జర్మనీ | 91,159 | 1,275 |
చైనా | 81,669 | 3,326 |
ఫ్రాన్స్ | 64,338 | 6,507 |