అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మిచెల్ పాంపియో భారతలో పర్యటించున్నారు. ఈ నెల 25న దేశానికి రానున్న ఆయన మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపాతానికి భారత నాయకత్వం, ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతారు పాంపియో. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తొలి విదేశీ ఉన్నత స్థాయి పర్యటన.
జపాన్‌లో జూన్ 28న ప్రారంభం కాబోయే జీ-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. ఇరు దేశాధినేతల సమావేశానికి ముందు భారత్‌లో పాంపియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు అధికారులతో పాంపియో సమావేశమవుతారని ఆ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
జైశంకర్‌కు పాంపియో ఫోన్..
భారత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో జైశంకర్‌కు పాంపియో ఫోన్ చేశారు. ట్రంప్ పరిపాలన విభాగం భారత్‌తో కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపాతానికి కట్టుబడి ఉందని తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గింది: వామపక్షాలు
భారత ఆర్థిక వ్యవస్థను అమెరికాకు అనుకూలంగా చేసేందుకు అగ్రరాజ్యం చేస్తోన్న ఒత్తిడికి భారత్ తలొగ్గిందని ఆరోపించాయి వామపక్షాలు. అమెరికా అజెండాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. వాణిజ్య అడ్డంకుల తొలగింపు, భారత్‌లో అమెరికా రక్షణ పరికరాలను అమ్మడానికే పాంపియో పర్యటిస్తున్నారని ఆరోపించాయి.
ప్రతిచర్య తప్పనిసరి
పాంపియో పర్యటనకు ముందు భారత్-అమెరికా వ్యాపార సంబంధాలకు విషయమై అగ్రరాజ్య వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితీజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై అమెరికా సుంకాలు పెంచింది. ఇందుకు ప్రతిచర్యగా భారత్ కూడా 28 రకాల అమెరికా ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంచింది. భారత్ చేస్తోన్న అన్యాయ చర్యలపై దృష్టి పెట్టామని, తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్