కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జనం ఇళ్లనుంచి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పలు దేశాలు విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా నెట్వర్క్ ప్రొవైడర్లు. ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికాలో ఎక్కువ నెట్వర్క్ కనెక్షన్లున్న కామ్‌కాస్ట్ సంస్థ శనివారం నుంచి 60 రోజులపాటు ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. అయితే ఇంట్లో ఉపయోగించే హాట్స్పాట్లను ఈ సేవల నుంచి మినహాయించనుంది కామ్‌కాస్ట్. అదే సమయంలో మరో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏటీ అండ్ టీ కూడా 60 రోజులపాటు ఉచిత వైఫై అందించనున్నట్లు తెలిపింది. కళాశాలలకు వెళ్లే వారికి ఉచిత బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ను అందించనున్నారు. మరో సంస్థ వెరిజోన్ ఇప్పటికే చందా బకాయిపడ్డవారికి కూడా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అదే సమయంలో టీ-మొబైల్ సంస్థ తమ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఫ్రీగా అంతర్జాల సేవలు అందిస్తోంది.
కరోనా కారణంగా బయట తిరగలేని పరిస్థితులు నెలకొనడం, ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ సదుపాయమే కీలకమైన నేపథ్యంలో ఉచిత వైఫైపై అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: స్పెయిన్ ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్