అమెరికాలో 25లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో వీరిలో సగం మంది మద్దతు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కే అని ఆయన మద్దతుదారులు అంటున్నారు. హెచ్1బీ వీసాల రద్దు నిర్ణయం ఎన్నికల్లో భారతీయులను ఏమాత్రం ప్రభావితం చేయబోదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్వత్రా.. ఉత్కంఠ
అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరిగినా దానిపై ఆ దేశంలో మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం అంతా ఆసక్తే. ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కూడా.. ఇప్పుడు అలాంటి ఆసక్తే నెలకొంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బరిలో నిలవనుండగా.. డెమొక్రట్ పార్టీ తరఫున ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అభ్యర్థిత్వం వచ్చే ఆగస్టులో ఖరారు కానుంది. అయితే ట్రంప్ మళ్లీ గెలుస్తారా లేక విజయం జో బిడెన్‌ను వరిస్తుందా అని ఇప్పటి నుంచే ఉత్కంఠ నెలకొంది.
మనోళ్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా..... ఆ దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న భారతీయ అమెరికన్లది ఎన్నికల్లో కీలక పాత్ర కాబోతోంది. అమెరికాలో భారతీయ అమెరికన్ల సంఖ్య 40లక్షలు కాగా, వీరిలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయగలరని భావిస్తున్న వారి సంఖ్య 25లక్షలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన టెక్సాస్, మిషిగన్, ఫ్లోరిడా, పెన్సిల్‌వేనియా రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ అమెరికన్లది....రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర కాబోతోంది.
ట్రంప్ తరపున భారతీయ అమెరికన్ల వ్యవహారాల ఆర్థిక కమిటీ సహ ఛైర్మన్‌గా ఉన్న అల్ మసన్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించబోతున్నారని వివరించారు. భారతీయ అమెరికన్లు ఆది నుంచి సంప్రదాయంగా డెమొక్రట్ పార్టీకి మద్దతుదారులుగా కొనసాగుతూ వస్తుండగా.... 25లక్షల మంది ఓటర్లలో సగం కంటే ఎక్కువ మంది..... ఆ పార్టీకి దూరమై రిపబ్లికన్ పార్టీ వైపు మళ్లినట్లు ఆయన తెలిపారు. అలా దూరమైన వారు కీలక రాష్ట్రాల్లో 50-60 వేల మంది చొప్పున ఉంటారని అల్ మసన్ అంచనా వేశారు. ఫ్లోరిడాలో ఆ సంఖ్య లక్షా పదివేల వరకు ఉంటుందని తెలిపారు.
మనల్ని గౌరవించినందుకే...
భారతీయ అమెరికన్లు డెమొక్రట్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీ వైపు మళ్లడానికి గల కారణాలను కూడా అల్ మసన్ విశ్లేషించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న కృషిని, అమెరికా ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు చేపట్టిన చర్యలను వారు ఆమోదించినట్లు వివరించారు. ట్రంప్ రూపంలో ఓ అమెరికా అధ్యక్షుడి ద్వారా తమకు మొదటి సారిగా గౌరవం, గుర్తింపు లభించాయని భారతీయ అమెరికన్లు భావిస్తున్నారని, ఎప్పుడూ సరిగా లేని భారత్-అమెరికా సంబంధాలు కూడా ఇప్పుడు బాగున్నాయని నమ్ముతున్నారని తెలిపారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భారత్‌ను, భారతీయులను గొప్ప మిత్రులుగా భావిస్తూ వచ్చారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ నెరుపుతున్న నిజమైన స్నేహాన్ని..... భారతీయ అమెరికన్లు గౌరవిస్తున్నారని, ఈ స్నేహ బంధంలో గొప్పదనం అంతా ట్రంప్‌దే అని వారు భావిస్తున్నారని అల్ మసన్ తెలిపారు.
వీసా సంస్కరణతో మేలు..
హెచ్1బీ వీసాల జారీని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ అమెరికన్లపై ఎలాంటి ప్రభావం చూపబోదని అల్ మసన్ అంటున్నారు. హెచ్1బీ వీసా విధానాన్ని ట్రంప్ సంస్కరించాలని ఆదేశించారని, ప్రతిభ ఆధారిత వలస విధానంపై ముందుకు సాగేలా ఆయన చర్యలు చేపట్టారని వివరించారు. ఇది భారత్, అమెరికా రెండు దేశాలు సహా భారతీయ అమెరికన్లకు కూడా మేలు చేస్తుందని తెలిపారు. భారతీయ అమెరికన్లు, భారత్‌లోని ఐటీ నిపుణులకు అత్యుత్తమ ప్రతిభ కేటగిరిలో.. ఉద్యోగాలు లభిస్తాయని విశ్లేషించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కరోనా కారణంగా ఇంకా ఊపందుకోకున్నా ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. అభ్యర్ధుల గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉన్న భారతీయ అమెరికన్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుండగా... విశ్లేషకులు అంచనా వేసినట్లు వారు అదే వైఖరితో ఉంటారా అన్నది ఫలితాల్లో తేలనుంది.
ఇదీ చదవండి: తాలిబన్లతో ఇకపై చర్చలు జరగవు: డొనాల్డ్ ట్రంప్