అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? అన్న ప్రశ్నకు అగ్రరాజ్య అధికారులు అవుననే సమాధానమిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓటు వేయాలని.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న డెమొక్రటిక్ ఓటర్లను ఇరాన్ ఈమెయిల్స్ ద్వారా బెదిరిస్తున్నట్టు అమెరికా ఉన్నతాధికారులు ఆరోపించారు.
అధ్యక్ష ఎన్నికలకు 13రోజుల ముందు ప్రభుత్వ అత్యున్నత నిఘా అధికారి జాన్ రాట్క్లిఫ్, ఎఫ్‌బీఐ డైరక్టర్ క్రిస్ వ్రేయ్ ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వీరు హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించడం, ఇరాన్‌పై వేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను వెలువరించకపోవడం గమనార్హం.
ఈ చర్యలు.. అమెరికాలో అనిశ్చితి సృష్టించేందుకు శత్రు దేశాలు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు రాట్క్లిఫ్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడిందని.. ఈసారి కూడా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే దేశాలపై భారీ స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు.
వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితా నుంచి ప్రజల ఈమెయిల్ అడ్రస్‌లు తీసుకుని ఇరాన్ మెయిల్స్ పంపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు కూడా అవకాశమున్నట్టు స్పూఫ్‌లు రూపొందించి మెయిల్స్ పంపుతున్నట్టు ఆరోపించారు. అయితే ఈ ఈమెయిల్స్‌లో ఉన్న సందేశాల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:- 'ఓట్లు వేయకపోతే ట్రంప్ తిరిగొస్తారు.. జాగ్రత్త'