అమెరికా ఓక్లహామాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చికాషాలోని తన పక్కింట్లో ఉండే మహిళను చంపాడు లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి. ఆ తర్వాత.. ఆమె గుండె బయటకు తీసి బంగాళదుంపల్లో కలిపి కూర చేశాడు.
ఆ ఆహారాన్ని తన కుటుంబసభ్యులకు వడ్డించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే.. వారిపై దాడి చేయగా అండర్సన్ మామ లియో పై, అతని మనుమరాలు కయెస్ యేట్స్ చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన తన అత్త డెల్సీ త్రుటిలో బయటపడింది. ఇలా మొత్తం ముగ్గురిని కిరాతకంగా చంపేశాడు.
దెయ్యాల నుంచి కాపాడేందుకే..
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అండర్సన్‌ను ఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు. విచారణలో భాగంగా.. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దెయ్యాల నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకే గుండె కూర తినిపించేందుకు ప్రయత్నించానని అతడు చెప్పడం గమనార్హం.
అండర్సన్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. ఓ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవలే రాష్ట్ర గవర్నర్ శిక్షా కాలాన్ని తగ్గించగా ఈ జనవరిలోనే విడుదలయ్యాడు.
ఇదీ చూడండి: మందిర పునాదిలో 4వేల క్వింటాళ్ల నెయ్యి!