అమెరికా ఆర్థిక పరిస్థితులు ఈ ఏడాది చివరి త్రైమాసికంలో వేగంగా మెరుగుపడుతాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాదిలో అమెరికా అసాధారణ వృద్ధి నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మరణాలు రేటు, కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు రాష్ట్రాలు తీసుకుంటోన్న చర్యలు ఫలిస్తాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
"మేం మళ్లీ పురోగమిస్తున్నాం. ఈ ఏడాది రెండో భాగంలో, ముఖ్యంగా నాలుగో త్రైమాసికం చాలా బాగుంటుంది. నాకు తెలిసి రెండో త్రైమాసికంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా మూడో త్రైమాసికం నుంచి పరిస్థితులు వేగంగా మారుతాయి. ఫలితంగా నాలుగో త్రైమాసికంతో పాటు వచ్చే ఏడాది ఈ సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్రస్తుత సంక్షోభానికి ఒక దేశం కారణమంటూ పరోక్షంగా చైనాను నిందించారు ట్రంప్. వాళ్లు వైరస్ను గుర్తించిన వెంటనే నియంత్రించగలిగితే ఇంతటి ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.
"నేను చరిత్రలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థను నిర్మించాను. కానీ ఈ రోజు ఎన్నడూ లేని విధంగా మన ఆర్థిక వ్యవస్థతోపాటు దేశాన్ని మూసివేయాల్సి వచ్చింది. జరిగిన ఈ నష్టానికి బాధ్యత ఒక దేశానిదే. ఇక ఎవరినీ ఇక్కడికి అనుమతించం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: తప్పును ఒప్పుకోవాలని అమెరికాపై చైనా ప్రతిదాడి