అగ్రదేశం అమెరికా ఓ వైపు చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు డ్రాగన్ మానవహక్కుల ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారింది.
చైనాను అడ్డుకునేందుకు..
వాయవ్య ప్రాంతంలోని ఉయ్ఘర్ మైనారిటీ ప్రజలను చైనా క్రూరంగా అణచివేస్తోందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మానవ హక్కుల ఉల్లంఘనను అడ్డుకునేందుకు చైనా అధికారులపై ఆంక్షలు, ఇతర చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే ఓ చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది అమెరికా కాంగ్రెస్. ఇప్పటికే సంబంధిత బిల్లును దిగువ సభ 407-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. రానున్న 2 వారాల్లో ఈ బిల్లును ఎగువసభ ఆమోదించే అవకాశముంది. తర్వాత ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది.
ట్రంప్‌కు మరో మార్గం లేదు!
చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది డొనాల్డ్ ట్రంప్ సర్కారు. ఈ అంశంపై చర్చలు జరుగుతుండగానే ఇటీవల హాంకాంగ్ వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్ బిల్లును ఆమోదించడం, దానిపై ట్రంప్ సంతకం చేయాల్సి రావడం... అధికార పక్షానికి కాస్త ఇబ్బందిగా మారింది. వాషింగ్టన్, బీజింగ్‌లోని పాలక వర్గాల మధ్య దూరం పెరిగేందుకు కారణమైంది. ఇప్పుడు అదే తరహాలో చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా మరో చట్టం చేసేందుకు సిద్ధమవడం... ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. ఈ సవాళ్లను అధిగమించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన ఏ మేరకు సఫలమవుతారన్నది చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: ట్రంప్ మాటలతో మళ్లీ ఆశలు- మార్కెట్లకు లాభాలు