చైనాతో అమెరికా వ్యూహాత్మక పోటీ ఎదుర్కొంటున్నట్లు బైడెన్ ప్రభుత్వం భావిస్తోందని శ్వేతసౌధం వెల్లడించింది. ముఖ్యంగా సాంకేతికత విషయంలో ఈ పోటీ అధికంగా ఉందని పేర్కొంది. సాంకేతికత రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపర్చడమే చైనా లక్ష్యమని వ్యాఖ్యానించింది. అలా జరిగేందుకు అనుమతిస్తే జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.
"చైనా ఉద్దేశాలపై ఏ మాత్రం అనుమానం లేదు. సాంకేతికత విషయంలో అమెరికా దీర్ఘకాల ఆధిపత్యాన్ని బలహీనం చేయడమే వారి లక్ష్యం. అందువల్లే శాస్త్ర, సాంకేతిక రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. సప్లై చైన్ సెక్యూరిటీ, పరిశోధనాభివృద్ధిపై దృష్టిసారించారు. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అధికారాలను ఉపయోగించుకుంటాం."
-జెన్ సాకి, శ్వేతసౌధ మీడియా కార్యదర్శి
కాగా, బైడెన్ యంత్రాంగం చైనా పట్ల మెతకవైఖరి పాటిస్తోందని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ ధ్వజమెత్తారు. అమెరికాకు చైనా అతిపెద్ద భౌగోళిక రాజకీయ ముప్పుగా పరిణమించిందని అన్నారు. బైడెన్ నామినీలు చైనాకు అనుకూలంగా వ్యవహరించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: