US Covid cases: అమెరికాలో కరోనా వైరస్ మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా సోమవారం ఒమిక్రాన్, ఇతర వేరియంట్లు సోకి 1,41,385 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య మంగళవారం 2021 రికార్డు స్థాయి సంఖ్యను దాటేస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రమాద ఘంటికలు..
అమెరికాలో ఒమిక్రాన్ ప్రభావం నిపుణుల అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరికొన్ని వారాల్లోనే 2,75,000 నుంచి 3,00,000కు చేరవచ్చని తెలుస్తోంది. సోమవారం కొలొరాడో, ఒరిగాన్,లూసియానా, మేరీల్యాండ్, వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
రోగులుగా మారుతున్న నర్సులు..
అమెరికాలో కేసుల తాకిడి బీభత్సంగా ఉండటంతో కరోనా వైరస్ బారిన పడే ఆసుపత్రి సిబ్బంది సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య సిబ్బంది సంఖ్య తక్కువగా.. చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమెరికాలో1,200 ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సంఖ్య దేశంలోని 24 శాతం ఆసుపత్రులకు సమానం. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ ధ్రువీకరించింది. మరో 100 ఆసుపత్రుల్లో రానున్న వారం రోజుల్లో సిబ్బంది కొరత ఏర్పడవచ్చని పేర్కొన్నారు.
కరోనా సోకినా వైద్యసేవలకు రండి..!
ఒమిక్రాన్ కారణంగా భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడటంతో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీలక నిర్ణయం తీసుకొంది. సార్స్‌కోవ్-2 పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోతే.. సిబ్బంది ఎన్-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా రోగి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వైద్యసిబ్బంది కూడా లక్షణాలు లేకపోతే ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఎన్-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. 'వైరస్ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు అసంబద్ధమైన చర్యను చేపట్టారు' అంటూ మండిపడ్డారు.
ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని వారిలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు కొత్తగా బ్రేక్‌త్రూ (వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో) ఇన్ఫెక్షన్లు కూడా నమోదవుతున్నాయి. ఈ సారి వచ్చే కేసుల సంఖ్య ప్రకారం అతి తక్కువ శాతం ఆసుపత్రుల్లో చేరినా.. ఐసీయూ పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని 'వాషింగ్టన్ పోస్టు' కథనం పేర్కొంది. 2021 జనవరి 12 తేదీన అత్యధికంగా 29,534 మంది ఐసీయూల్లో చికిత్స పొందారు. ఈసారి సోమవారం నాటికి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 23,524కు చేరింది.
చైనాలో మరో నగరంలో లాక్డౌన్..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మరో నగరంలో లాక్డౌన్ విధించింది స్థానిక ప్రభుత్వం. ఈ నిర్ణయంతో చైనాల ఇళ్లకు పరిమితం అయిన వారి సంఖ్య 2 కోట్లకు పెరిగింది. 55 లక్షల మందికి పైగా జనాభా ఉన్న అన్యాంగ్ నగరంలో తాజాగా లాక్‌డౌన్‌ను అమలు చేశారు అధికారులు. దీనితో పాటే వైరస్ నిర్ధరణకు సామూహిక పరీక్షలు చేస్తున్నారు.
ఐరోపాలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు...
జనవరి మొదటి వారంలో ఐరోపా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సుమారు 70 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. కేవలం రెండు వారాల్లోనే కేసుల సంఖ్య రెండు రెట్ల కంటే ఎక్కువ అయినట్లు పేర్కొంది. నిపుణులు అంచనాల ప్రకారం పశ్చిమ ఐరోపాలోని జనాభాలో సగం మందికి పైగా రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా బారిన పడతారని అంచనా వేస్తున్నారు.
బూస్టర్ డోసు వేగవంతం.. సరిహద్దుల మూసివేత..
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు జపాన్ ప్రభుత్వం బూస్టర్ డోసుల పంపిణీని మరింత వేగవంతం చేసింది. దీంతో పాటు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ దేశ ప్రధాని కిషిడా తెలిపారు. అంతేగాకుండా ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దులను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు.
లక్ష దాటిన కొవిడ్ మృతుల సంఖ్య..
పోలాండ్‌లో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరింది. వీటిలో నాలుగోవంతు మంది అంటే సుమారు 24 వేల మందికి పైగా ఇటీవల ప్రారంభమైన వేవ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌లను పెద్ద సంఖ్యలో వేస్తున్నట్లు పేర్కొన్నారు.
10 కోట్లకు పైగా టీకాల పంపిణీ..
టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పాకిస్థాన్ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మందికి పైగా తొలిడోసు టీకాను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటికే ఐదో వేవ్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఖాట్మాండులో లాక్డౌన్..
నేపాల్‌లో కూడా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఖాట్మాండులోని లోయలో పాక్షిక లాక్‌డౌన్‌ను విధించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 25 మందికి పైగా గుమిగూడడం నిషేధించినట్లు చెప్పింది. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: